- అక్రమంగా ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆందోళన
శంషాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా తొండుపల్లి గ్రామ హిందూ శ్మశానవాటికలో కొందరు అక్రమంగా భారీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలో చనిపోయిన వ్యక్తికి గురువారం అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు శ్మశానానికి వెళ్లారు. ఇప్పటికే అక్కడ నాలుగైదు భారీ హోర్డింగులు ఉండగా, తాజాగా కొత్తది ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుర్తించారు. హోర్డింగ్ఏర్పాటుకు ఓ సమాధిని ధ్వంసం చేసినట్లు గమనించి, ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా కొందరు అక్రమార్జనే ధ్యేయంగా హోర్డింగులు పెడుతున్నారని, గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు జాగా కూడా ఉండడం లేదని వాపోయారు. ఇప్పటికే రెండు మూడు సమాధులను ధ్వంసం చేశారని, వెంటనే హోర్డింగులను తొలగించాలని డిమాండ్చేశారు. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాగా, తొండుపల్లి గ్రామనికి చెందిన హిందూ శ్మశానవాటిక ఓఆర్ఆర్ విస్తరణలో పోయింది.
గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు అధికారులు ప్రత్యామ్నాయంగా తొండుపల్లి, గొల్లపల్లి మధ్య ఉన్న ప్రభుత్వ స్థలంలో 5 ఎకరాలను కేటాయించారు. అప్పటి నుంచి గ్రామస్తులకు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సమాధులు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డును ఆనుకుని ఉండడంతో కొందరు కన్ను శ్మశాన వాటికపై పడింది.