
- రేషన్ తీసుకోవడానికి ఆధార్ – మొబైల్ నంబర్ లింకింగ్ కోసం జనాల తిప్పలు
- పొద్దున లేవంగనే మండల కేంద్రాలకు పరుగులు
- లబ్ధిదారులు లక్షల్లో ఉంటే ఆధార్ సెంటర్లు పదుల్లోనే
- గంటల తరబడి క్యూ లైన్లలో జనం పడిగాపులు
- నరకయాతన పడుతున్న ముసలోళ్లు
- అందిన కాడికి వసూలు చేస్తున్న సెంటర్ల నిర్వాహకులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రేషన్ బియ్యం తీసుకోవాలంటే ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ ఉండాలని రూల్ రావడంతో జనం ఉరుకులు పరుగులు పెడుతున్నరు. పొద్దుగాళ్ల లేచి సక్కగా ఆధార్ సెంటర్‌కు పోతున్నరు. కార్డులున్నోళ్లు లక్షల్లో.. ఆధార్ సెంటర్లు పదుల్లో ఉండటంతో సెంటర్లకు జనాల తాకిడి విపరీతంగా ఉంటోంది. గంటల తరబడి క్యూల్లో నిల్చోలేక జనాలు తిప్పలు పడుతున్నరు. ముసలోళ్లయితే ఇంకింత ఆగమైతున్నరు. అసలు ఇప్పటివరకు ఫోన్ వాడనోళ్లు రేషన్ కోసం కొత్తవి కొంటున్నరు. ఇదే చాన్స్ అనుకొని కొన్ని సెంటర్ల నిర్వాహకులు అందినకాడికి వసూలు చేసి పని కానిచ్చేస్తున్నరు.
ఈమె పేరు అంకుస్ బీ. ఊరు భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం. వయసు 82 ఏండ్లు. దివ్యాంగురాలు. భర్త పదేండ్ల కింద చనిపోయాడు. ఈమె పేరిటే రేషన్ కార్డుంది. బియ్యం తీసుకోవడానికి రేషన్ షాప్‌కు పోతే ఆధార్ కార్డుకు సెల్ నంబర్ లింక్ చేసుకొని రావాలని డీలర్ చెప్పాడు. దీంతో 10 కిలోమీటర్ల దూరంలోఉన్న మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రానికి సద్ది కట్టుకొని వచ్చింది. అప్పటికే వందల సంఖ్యలో జనం క్యూలో ఉండటంతో ఇలా నేలపై ఎండలో గంటల తరబడి కూర్చుంది.
రాష్ట్రంలో 87 లక్షల 44 వేల 110 రేషన్ కార్డులున్నాయి. 2.79 కోట్ల మంది రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి రేషన్ బియ్యం పంపిణీకి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. లబ్ధిదారుల సెల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్ వర్డ్) ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నారు. అయితే లబ్ధిదారుల్లో 70 శాతం మందికిపైగా ఆధార్, ఫోన్ నంబర్ లింక్ లేకపోవడం.. ఉన్నా ఎప్పుడో వాడటం మానేసిన పాత ఫోన్ నంబర్ల లింక్ ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. వారంతా ఆధార్‌లో సెల్ నంబర్‌ను అప్ డేట్ చేసుకుంటే తప్ప రేషన్ తీసుకునే పరిస్థితి లేదు. దీంతో ప్రజలంతా ఒక్కసారి గా ఆధార్ సెంటర్ల వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఆధార్ సెంటర్లు తక్కు వగా ఉన్నాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 593 మండలాలు ఉండగా మండలానికొకటి చొప్పున ఆధార్ సెంటర్లు ఉన్నాయి. మరోవైపు ప్రతి మండలంలో సుమారు 5 వేల నుంచి 20 వేల మంది ఆధార్ అప్ డేషన్ చేయించుకోవాల్సి ఉందని అంచనా.
గొడవలు జరుగుతున్నయ్
ఆధార్ సెంటర్లకు ఒకేసారి వందలాది మంది వస్తుండటంతో తీవ్రమైన ఇబ్బంది నెలకొంటోంది. తెల్లారి నుంచే లబ్దిదారులు వచ్చి లైన్లలో నిలబడుతున్నారు. తహసీల్దార్ ఆఫీసులు, ఆధార్ అప్ డేషన్ సౌకర్యం ఉన్న మీసేవ సెంటర్లు, బ్యాంకులు రేషన్ లబ్ధిదారులతోనే నిండిపోతున్నాయి. రెవెన్యూ, బ్యాంకుల ఆఫీసర్లు సాయంత్రం 5 దాటగానే సెంటర్లను మూసేసి వెళ్లిపోతున్నారు. ఒక్కోచోట రోజుకు 70 నుంచి వంద ఆధార్ నంబర్లను మాత్రమే అప్ డేట్ చెయ్యగలుగుతున్నారు.
గంటలు గంటలు వెయిటింగ్
ఆధార్ కార్డుకు సెల్ నంబర్‌ను అటాచ్ చేయడానికి ఒక్కరికి 10 నిమిషాల దాకా టైం తీసుకుంటోందని సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రతీ కార్డుదారుల వేలిముద్రలు, ఐరిస్ తీసుకోవాల్సి ఉంటుందని.. మధ్యలో కరెంట్, సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల పని సరిగా జరగడం లేదని అంటున్నారు. రోజంతా
పని చేసినా 60, 70కి మించి అప్ డేట్ చెయ్యలేకపోతున్నామని అంటున్నారు.
అడ్డగోలుగా వసూళ్లు
ఆధార్ అప్ డేషన్, సెల్ నంబర్ లింక్ చేయడానికి రూ.50 చొప్పున మాత్రమే ఫీజు వసూలు చెయ్యాలి. కానీ జనం పెద్ద సంఖ్యలో లైన్లు కట్టడంతో సెంటర్ల వాళ్లు రూ. వంద నుంచి 200 దాకా వసూలు చేస్తున్నారు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటుండటంతో.. కొన్ని చోట్ల రూ.300 నుంచి రూ.500 వరకు తీసుకుని, దొడ్డిదారిన తీసుకెళ్లి అప్ డేషన్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
కొత్తగా ఫోన్లు కొంటున్న వృద్ధులు
భర్త లేదా భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న వేలాది మంది వృద్ధుల దగ్గర సెల్ ఫోన్లు లేని పరిస్థితి. సెల్ ఫోన్ వాడటం రాకపోవడం, నెలానెలా డబ్బులు పెట్టి రీచార్జి చేయించాల్సి రావడం వంటివాటితో చాలా మంది ఫోన్లు వాడటం లేదు. ఇప్పుడు రేషన్ బియ్యానికి ఓటీపీ అవసరం కావడంతో కొత్తగా ఫోన్లు కొనాల్సి వస్తోంది. దాచుకున్న డబ్బులు పెట్టి, వెయ్యి పదిహేను వందల రూపాయల్లో దొరికే ఫోన్లు కొంటున్నారు. వాటిల్లోకి సిమ్‌కార్డు, రీచార్జిల కోసం అదనంగా ఖర్చు చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది.
సిటీలో సతాయిస్తున్న రేషన్ సర్వర్లు
హైదరాబాద్ లో 5 లక్షల 80 వేల 781 ఆహార భద్రత కార్డులున్నాయి. ఇవి కాకుండా వేరే జిల్లాల కార్డుదారులు ప్రతి నెల మరో 50 వేల మంది ఇక్కడ రేషన్ తీసుకుంటున్నారు. కొత్తగా ఐరిస్, మొబైల్ ఓటీపీ విధానం రావడంతో సిటీ పరిధిలోని 632 మంది రేషన్ డీలర్లకు ఐరిస్ పరికరాలను పంపిణీ చేశారు. అయితే సర్వర్లు సతాయిస్తుండటంతో రేషన్ పంపిణీ లేటవుతోందని డీలర్లు చెబుతున్నారు. ఇలాంటివి స్టార్ట్ చేసే ముందు సర్వర్ల సమస్య లేకుండా చేస్తే రేషన్‌ను త్వరగా పంపిణీ చేయొచ్చని అంటున్నారు. కొత్త సిస్టం ద్వారా ఇప్పటికి లక్షమందికి రేషన్ పంపిణీ జరిగింది.
తగిన ప్రచారం లేక..
ఫిబ్రవరి ఒకటి నుంచి ఓటీపీ, ఐరిస్ ద్వారానే రేషన్ బియ్యం పంపిణీ చేస్తామన్న విషయంపై జనంలో సర్కారు అవగాహన కల్పించక ఈ సమస్య వచ్చిందని ఎక్స్ పర్టులు చెప్తున్నారు. ప్రస్తుతం మండలానికో ఆధార్ సెంటరే ఉందని.. వేలాది ఆధార్ కార్డులకు సెల్ నంబర్ అటాచ్ చేయడానికి చాలా టైం పడ్తుందని చెప్తున్నారు. రెండు మూడు నెలలు గడువు పొడిగిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
ప్రతి సెంటర్‌కు వేల మంది వస్తున్నరు
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా లక్షా 21 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆధార్ కేంద్రాలు మాత్రం 14 ఉన్నాయి. ప్రస్తుతం రేషన్ సరుకులు ఇవ్వాలంటే ఆధార్ కార్డుకు సెల్‌ఫోన్ నంబర్ లింక్ చెయ్యడం తప్పనిసరి అంటూ ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది. మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తేనే బియ్యం ఇస్తరు. లేదా ఐరిస్ ద్వారా తీసుకోవచ్చు. ప్రస్తుతం రేషన్ బియ్యం పంపిణీ మొదలుకావడంతో ప్రతి ఆధార్ సెంటర్‌కు వేల మంది లబ్ధిదారులు వస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తం.
– శ్రీకాంత్ , ఈడీఎం, జయశంకర్ భూపాలపల్లి