హైదరాబాద్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ నేషనల్హైవేపై జనవరి 11న తెల్లవారుజాము నుంచే రద్దీ పెరిగింది. ఇవాళ పొద్దున్న నుంచే వేలాదిగా కార్లలో ఫ్యామిలీతో సహా సొంత ఊర్లకు ప్రయాణమయ్యారు. దీంతో ఎల్బీ నగర్ నుండి విజయవాడ నేషనల్హైవే రోడ్డుతో పాటు అబ్దులాపూర్‌మెట్ ఓఆర్‌ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఔటర్‌రింగురోడ్డుపై వందల వాహనాలు బారులు తీరాయి. టోలు ఫీజలు వసూలు చేస్తుండడంతో వాహనాలు రోడ్డుపై భారీగా నిలిచిపోయాయి.
ఫాస్ట్ టాగ్ రీఛార్జీలు చేసుకోలేని వారి వల్ల వాహనాలు కదలక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రశాంతంగా వాహనాలు మూవ్అవుతున్నాయి. చౌటుప్పల్ చౌరస్తా వద్ద అండర్‌పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ కూడలి రద్దీగా మారాయి. పెద్ద అంబర్ పేట వద్ద కోలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్‌ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే కార్లు, ఇతర వాహనాలతో నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వంతెన నిర్మాణం, అనుబంధ సర్వీస్ రోడ్డు నిర్మాణం కారణంగా రద్దీ పెరిగింది.
రాచకొండ సీపీ ఆదేశాలతో..
పండగకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలో టాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రధానంగా నేషనల్హైవే ట్రాఫిక్‌పై స్పెషల్ఫోకస్పెట్టారు. వాహనాల రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మర్గాలు పోలీసులు సూచిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ట్రాఫిక్డీసీపీ మల్లారెడ్డి చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజాను పరిశీలించారు. పోలీసులు 10 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు.