
హైదరాబాద్, వెలుగు: సమాజంలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ల పాత్ర కీలకమని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమాల్లో యూత్, ఎడ్యుకేషన్, హెల్త్ తదితర రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద శాశ్వత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్ లో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) మూడు రోజుల పాటు నిర్వహించిన ఆలిండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు అజిత్ పాఠక్ మాట్లాడుతూ తర్వాతి సదస్సును శ్రీలంకలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. రెండు దశాబ్దాల తర్వాత జాతీయ సదస్సును నిర్వహించే అవకాశం రావడంపై హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు పి.వేణుగోపాల్ రెడ్డి సంతోషం తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్ఎస్ఐ చాప్టర్ అవార్డులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఉత్తమ చాప్టర్ అవార్డును హైదరాబాద్ చాప్టర్ పొందింది. ఉత్తమ చాప్టర్ చైర్మన్ అవార్డును హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ పి.వేణుగోపాల్ రెడ్డి, జైపూర్ చాప్టర్ చైర్మన్ రవిశంకర్ శర్మ స్వీకరించారు. బెస్ట్ ఎమర్జింగ్ చాప్టర్ గా తిరుపతి చాప్టర్ అవార్డు పొందింది. అధిక సంఖ్యలో ప్రతినిధులను నమోదు చేసిన చాప్టర్ గా వైజాగ్ చాప్టర్ స్పెషల్ అవార్డు పొందింది.