
రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ లక్ష్యాలను సాధించకపోతే ప్రజా ప్రతినిధులు, అధికారుల పై వేటు తప్పదని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. సామాన్యుడు కేంద్రీకృతంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని, పరిపాలనలో కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… నియంత్రిత పంటల సాగు దేశానికే ఆదర్శమన్నారు. మూస విధానాలకు స్వస్తి పలికి, రైతును రాజుగా చూసేందుకే నియంత్రిత సాగు అని అన్నారు.
ఈ వానాకాలం జిల్లాలో అదనంగా మరో 8 వేల మంది రైతులకు రైతు బంధు ఇవ్వనున్నట్టు తెలిపిన మంత్రి…ప్రతి రైతుకు రైతుబంధు అందేలా చూసే బాధ్యత జెడ్పీటీసీ, ఎంపీపీ లదేనన్నారు. రైతుబంధు పై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.
జిల్లాలో యుద్ధ ప్రాతిపాదికన కల్లాలు, షేడ్ ల నిర్మాణం చేపట్టాలన్నారు. దసరా కల్లా రైతు వేదికల నిర్మాణం ప్రారంభించాలని, అన్ని రైతు వేదికల కు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధి హామీ పథకం ద్వారా ద్వారా పంచాయితీ కార్యాలయ భవనాలు నిర్మాణం చేపట్టాలన్నారు. జులై 15 కల్లా ప్రతి ఇంచు భూమిలో ఏ పంట పండుతుందో జెడ్పీటీసీ, ఎంపీపీ లకు అవగాహన ఉండాలని చెప్పారు.