
సర్కారీ స్కూళ్లకు సర్జరీ చేయాల్సిన టైం వచ్చింది. కూలడానికి సిద్ధంగా ఉన్న పైకప్పులు, పెచ్చులూడిన గోడలే స్డూడెంట్లకు స్వాగతం పలుకుతున్నాయి. కొన్ని స్కూళ్లలో అయితే, పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది. నిలువ నీడ లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పిల్లలు క్లాసులు వినాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే, ఆ సర్జరీ చేసేందుకే విద్యాశాఖ దగ్గర డబ్బు లేనట్టు తెలుస్తోంది. ఇటీవలే స్కూళ్లు, వాటిలోని క్లాసురూంల పరిస్థితిపై పాఠశాల విద్యాశాఖ అంతర్గతంగా నివేదిక సేకరించినట్టు తెలుస్తోంది. ఆ నివేదిక ప్రకారం21,669 స్కూళ్లలో 1,19,211 క్లాస్రూంలు ఉండగా, 52,396 మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయని ఆ నివేదికలో తేలినట్టు సమాచారం. 66,815 క్లాసులకు రిపేర్లు అవసరం ఉండగా, 10,355 గదులు అసలు ఉండడానికే పనికి రావని నివేదికలో అధికారులు తేల్చినట్టు చెబుతున్నారు. ఆ పనికిరాని క్లాసులను కూల్చేయాలని అధికారులు గుర్తించారు. వాటిలో ఎక్కువగా కామారెడ్డి జిల్లాలోనే 781 క్లాసులు పనికిరాకుండా ఉన్నాయి. ఆ తర్వాత సంగారెడ్డిలో 772, నిజామాబాద్లో 618 క్లాసులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అతి తక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 118 క్లాసులు పనికిరాకుండా ఉన్నాయి.
16,267 గదులకు మేజర్ రిపేర్లు…
రాష్ర్టంలో ఇబ్బందికరంగా మారిన 16,267 క్లాస్రూంలకు పెద్ద పెద్ద రిపేర్లు చేయాల్సి ఉందని, అప్పుడైతేనే విద్యార్థులకు బాగుంటుందని అధికారులు చెబుతున్నారు. మరో 39,042 క్లాసులకు చిన్న రిపేర్లు సరిపోతాయని సూచించినట్టు సమాచారం. అందులోనూ ఎక్కువ స్కూళ్లు సంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. అక్కడ 1,119 స్కూళ్లకు మేజర్ రిపేర్లు అవసరం. ఆ తర్వాత రంగారెడ్డి 869, నిజామాబాద్ 859, మహబూబ్నగర్లో 831 క్లాసులకు పెద్ద పెద్ద మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే ఇన్ని క్లాస్రూంలకు రిపేర్లు చేసేంత డబ్బు విద్యాశాఖ దగ్గర లేనట్టు తెలుస్తోంది. సర్కారు కూడా ఇస్తుందన్న ఆశ కూడా అధికారుల్లో లేదు. వర్షాకాలం రావడంతో పరిస్థితి మరింత దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఏం చేయాలన్న దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి పిల్లలకు ఏదైనా అయితే చెడ్డపేరొస్తుందని, కనీసం కొన్ని నిధుల్నైనా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నారు. కాగా, 2017–18 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 11,257 అదనపు క్లాసులు అవసరం. ప్రస్తుతం 1,151 క్లాసులను కడుతున్నారు. గురుకులాల సంఖ్య పెరుగుతుండడంతో సర్కారీ స్కూళ్లలో స్టూడెంట్లు తగ్గుతున్నారు. దీంతో కొత్త నిర్మాణాల జోలికి వెళ్లొద్దని సర్కార్ భావిస్తోంది. కొన్ని చోట్లయితే స్టూడెంట్లు తక్కువగా ఉండడంతో, ఉన్న గదులనూ వాడట్లేదు.