- పవిత్ర గంగా జలంతో కేస్లాపూర్‌కు తిరుగు ప్రయాణం
జన్నారం, వెలుగు : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేవులో ఉన్న హస్తినమడుగులో మంగళవారం మెస్రం వంశీయులు పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబాకు అభిషేకం చేయడానికి ఇక్కడి నుంచే గంగాజలం తీసుకెళ్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేదీన కేస్లాపూర్ నుంచి బయలుదేరిన 102 కుటుంబాలకు చెందిన180 మంది మెస్రం వంశీయులు సుమారు 80 కిలోమీటర్ల మేర నడిచి మంగళవారం కలమడుగులోని గోదావరి రేవుకు చేరుకున్నారు. ముందుగా హస్తినమడుగులో పవ్రిత స్నానం చేసి పితృ దేవతలకు పూజలు చేశారు. నాగోబాకు అభిషేకం చేసేందుకు వెంట తెచ్చుకున్న జరిలో గంగాజలం నింపుకున్నారు. తర్వాత సహపంక్తి భోజనం చేసి గంగాజలంతో తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నడుస్తూ ఈ నెల 17న ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకోనున్నారు. అక్కడ పూజలు చేసి కేస్లాపూర్‌లోని మర్రి చెట్టు వద్ద మూడు రోజులు బస చేస్తారు. 21న అర్ధరాత్రి నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేసి జాతర ప్రారంభిస్తామని మెస్రం వంశ పటేల్ వెంకట్ రావు, ప్రధాన్ మేస్రం దాదారావు, కఠోడలు మేస్రం కోసు, నాగోబా పెన్ కోత్వల్ మెస్రం తిరుపతి చెప్పారు.

