గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే మైనింగ్

గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే మైనింగ్
  •    పక్కనే వేంకటేశ్వర ఆలయం, మూడు స్కూళ్లు, హాస్టళ్లు
  •     లీజు రెన్యూవల్ అయ్యిందంటున్న కాంట్రాక్టర్
  •     అడ్డుకున్న గ్రామస్తులు.. మద్దతిచ్చిన ప్రతిపక్షాలు
  •     అనుమతులు రద్దు చేయాలని డిమాండ్

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామ సమీపంలోని పులిగుట్టను పొతం పెడుతున్నారు. క్వార్ట్జ్ ఖనిజం పేరుతో లీజుకు తీసుకొని ఎర్రమట్టిని తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, 20 ఏళ్ల కిందనే పర్మిషన్‌‌‌‌ తీసుకున్న కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు లీజ్‌‌‌‌ రెన్యూవల్ అయ్యిందంటూ 15 రోజుల కింద మళ్లీ తవ్వకాలు చేపట్టారు.  అయితే జీపీ తీర్మానం లేకపోవడం, పక్కనే టెంపుల్‌‌‌‌, స్కూళ్లు, హాస్టళ్లు ఉండడంతో గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ప్రతిరోజూ పనులను అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు.  జీపీ తీర్మానం లేకుండా పర్మిషన్‌‌‌‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.  తవ్వకాలు ఆపకపోతే ఎంతవరకైనా తెగిస్తామని హెచ్చరిస్తున్నారు.  విషయం తెలుసుకున్న  బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డోకూరు పవన్ కుమార్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి  ఆదివారం పులిగుట్టను సందర్శించి గ్రామస్తులకు మద్దతు ఇచ్చారు. 

2002లో మొదలైన ఇష్యూ..

కొత్తకోట మండలం అమడబాకుల శివారులోని సర్వేనెంబర్ 20లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో క్వార్ట్జ్‌‌‌‌ ఖనిజం వెలికితీస్తామని 2002లో శివలీల అనే కాంట్రాక్టర్ లీజ్‌‌‌‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.  పర్మిషన్‌‌‌‌ రావడంతో మైనింగ్‌‌‌‌ చేసేందుకు సిద్ధమవగా.. స్థానికులు వ్యతిరేకించడంతో ప్రయత్నాలు విరమించుకున్నారు.  తర్వాత ప్రభుత్వం పులిగుట్ట సమీపంలో 2006లో ఏనుగుంట రిజర్వాయర్ నిర్మించింది. భీమా ఫేజ్–2లో భాగంగా రామన్ పాడు రిజర్వాయర్ నుంచి ఇందులోకి నీటిని తరలించి... వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తున్నారు.  ఈ గుట్ట పక్కనే 200  ఏండ్ల కింద  వనపర్తి సంస్థానాధీశులు నిర్మించిన కల్యాణ  వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కొన్నేళ్ల కింద ప్రభుత్వం మోడల్ స్కూల్,  కేజీబీవీ, హైస్కూల్‌‌‌‌తో పాటు హాస్టళ్లను కూడా ఈ పక్కనే  నిర్మించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. రెండు నెలల కింద తనకు లీజు రెన్యూవల్‌‌‌‌ అయ్యిందని డాక్టర్ వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి గుట్టవద్దకు వచ్చాడు.  15 రోజుల కింద మిషనరీ తెప్పించి పోలీసు భద్రతతో తవ్వకాలు చేపట్టారు.   

ఎర్రమట్టి అమ్ముకుంటున్నరు 

క్వార్ట్జ్, పల్స్ ఫేర్ ఖనిజం కోసం లీజు పొందిన కాంట్రాక్టర్ ఎర్రమట్టి అమ్ముకుంటున్నారని బీజేపీ మహబూబ్ నగర్ లోక్ సభ ఇన్‌‌‌‌చార్జి  డోకూరు పవన్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం పులిగుట్టను సందర్శించి గ్రామస్తులకు మద్దతిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పులిగుట్ట మైనింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. దేవాలయాలు, విద్యాలయాలు,  రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌తో ఉన్నా... ఎలా పర్మిషన్ ఇస్తారని నిలదీశారు.  ఎమ్మెల్యే స్పందించి లీజు రద్దు చేయించాలని, లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. 

కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌పై క్రిమినల్ కేసు పెట్టాలి

కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌పై క్రిమినల్ కేసు పెట్టాలని మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్ జి.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పులిగుట్టను సందర్శించిన ఆయనకు కొన్ని నెమళ్లు చనిపోవడం, వాటి గుడ్లు పగిలిపోవడం కంట పడింది.  దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌పై క్రిమినల్ కేసు పెట్టి.. మైనింగ్ అధికారులను సస్పెండ్ డిమాండ్ చేశారు.  పర్యావరణానికి ముప్పుగా మారిన మైనింగ్‌‌‌‌ పర్మిషన్‌‌‌‌ రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

తీర్మానం లేకుండానే పనులు 

పులిగుట్టను  మైనింగ్‌‌‌‌కు ఇవ్వడంపై గ్రామపంచాయతీ తీర్మానం చేయలేదు. 20 ఏళ్ల కింద కూడా తీర్మానం లేకుండానే అధికారులు పర్మిషన్ ఇచ్చారు. కానీ, గ్రామస్తులు పనులు చేయనివ్వలేదు.  లీజు రద్దు చేయాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించినం. పనులు ఆపే వరకు గ్రామంలో నిరసనలు చేస్తూనే ఉంటం.  
-బుచ్చన్న, సర్పంచ్, అమడబాకుల 

అభ్యంతరాలను పరిశీలిస్తున్నం

పులిగుట్ట లీజు రెన్యువల్ వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి.  కలెక్టర్ ఆదేశాల మేరకు పులిగుట్టను సందర్శించి గ్రామస్తుల అభిప్రాయాలను తీసుకున్నం.  సమీపంలోని దేవాలయాలు, విద్యాలయాలు,  రిజర్వాయర్ ఉండడంతో తవ్వకాలు చేస్తే ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. గ్రామస్తుల అభ్యంతరాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.
–-పద్మావతి, ఆర్డీవో, వనపర్తి