
జోగిపేట, వెలుగు: టోల్ గేట్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, 25 కిలో మీటర్ల దూరం ఉన్న గ్రామాలకు ఉచిత పాస్‌లను ఇవ్వాలని, తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండలానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సోమవారం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో నేషనల్ హైవే 161ను దిగ్భంధం చేశారు. దీంతో ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ముందుగానే పెద్ద సంఖ్యలో టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ప్రజలు తాడ్‌దాన్ పల్లి చౌరస్తా వద్ద బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జోగిపేట నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న అంబులెన్సుకు ఆందోళనకారులు దారిచ్చారు. జాతీయ రహదారి నిర్మాణంలో ఎందరో భూములను కొల్పోయారని, ఆ కుటుంబాలకు టోల్‌ప్లాజాలో ఉద్యోగాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు.
జాతీయ రహదారి నిర్మాణంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని రాష్ట్ర ధర్మ ప్రసారక్ కో కన్వీనర్ సుభాష్ చందర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పల్లె సంజీవయ్య, నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్‌లు డిమాండ్ చేశారు.
కాస్సేపు ఉద్రిక్త వాతావరణం...
జాతీయ రహదారిపై చేపట్టిన ధర్నా కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చౌరస్తా నుంచి సుమారుగా 25 గ్రామాల వరకు ఉంటాయని, వాటి ప్రజలు సంగారెడ్డి వైపు వెళ్లాలంటే నాలుగు కిలో మీటర్ల దూరంలో యూ టర్న్ తీసుకోవాల్సి వస్తుందన్నారు. తాడ్‌దాన్‌పల్లి వద్ద అండర్ పాస్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు రైతులు జేసీబీని తెప్పించి, రోడ్డుపై డివైడర్‌ను పగలగొట్టే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వారికి కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. నే షనల్ హైవే సైట్ ఇంజినీర్‌లు అక్కడికి చేరుకుని హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అండర్ పాస్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
భారీగా మోహరించిన పోలీసులు..
డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, జోగిపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సౌమ్యానాయక్, గణేష్‌లతో పాటు సీఆర్‌పీఎఫ్ పోలీసులు బందోబస్తు చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. నాయకులు టోల్‌ప్లాజా వద్ద కాకుండా తాడ్‌దాన్‌పల్లి చౌరస్తా వద్ద ధర్నా చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.