
పూణే పోర్షె కారు ప్రమాద కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే యువకుడి తండ్రిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆయనను తదుపరి విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు.
రిమాండ్ కాపీ ప్రకారం, విశాల్ అగర్వాల్ దర్యాప్తులో పోలీసులకు సహకరించడం లేదు కావున తదుపరి విచారణ కోసం సెషన్ కోర్టు అనుమతి కోరారు. అందుకు కోర్టు అనుమతించడంతో రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
అంతకుముందు రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన విశాల్ అగర్వాల్‌ను విచారణకు రావాలని పోలీసులు కోరినప్పుడు.. షిర్డీ, ఔరంగాబాద్‌లో ఉన్నానని చెప్పి వారిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. విశాల్‌ను అరెస్టు చేసే సమయంలో అతని వద్ద ఒక సాధారణ నోకియా ఫోన్, కియా కంపెనీ కారు ఉంది. ఈ రెండింటినీ పోలీసులు జప్తు చేశారు. ఇప్పటికే ఆయనపై జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75, 77, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏంటి ఈ కేసు..?
మే 17న ఆదివారం తెల్లవారుజామునన పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో ఓ 17 ఏళ్ల యువకుడు వేగంగా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల(అనీష్ అవదీయ, ఆశ్విని కోస్టా) ప్రాణాలు తీశాడు. ఆ సమయంలో టీనేజర్ నడుపుతున్న కారు బ్రాండే.. పోర్షే. ఆ కారు విలువ దాదాపు 4 కోట్ల రుపాయలు.
ఈ ఘటన తర్వాత సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేయగా.. కోర్డు అరగంటలో అతనికి బెయిల్ మంజూరు చేసింది. అందునా, బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు విధించిన షరతులూ చర్చనీయాంశం అయ్యాయి. నిందితుడికి రూ. 7,500 ష్యూరిటీపై బెయిల్ మంజూరు చేయడం.. రోడ్డు ప్రమాదాలు, పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమనడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయమనడం వంటి షరతులపై అన్ని వర్గాల నుండి విమర్శలు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని కఠిన చర్యలకై ఆదేశించింది.