ట్రైనీ ఐఏఎస్.. ఈమె వ్యవహారంతో సర్కారే పరేషాన్..

 ట్రైనీ ఐఏఎస్.. ఈమె వ్యవహారంతో సర్కారే పరేషాన్..

ఐఏఎస్ ఎందుకు ఎంచుకున్నారు..? అని ఏ కలెక్టర్‌ని ప్రశ్నించినా వారి నోటి నుండి వచ్చే మాట.. 'ప్రజాసేవ చేయడానికి'.  అది వాస్తవమే. ఎన్ని సినిమాల్లో చూస్తలేం.. కానీ, ఈ కలెక్టరమ్మా.. కాదు, కాదు, కాబోయే ఈ కలెక్టరమ్మా రూటు వేరు. ప్రజాసేవ దేవుడెరుగు.. ఆమెకు సేవలు చేయలేక కింద స్థాయి ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారట. ఎలాగూ కలెక్టర్ అవుతున్నాను కదా..! అని ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి శిక్షణలో ఉండగానే ఆదేశాలు ఇవ్వడం మొదలు పెట్టిందట. అవన్నీ ఉన్నతాధికారుల చెవిన పడటంతో ఆమెను మరో చోటికి బదిలీ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

సొంతకారుకు ప్రభుత్వం స్టిక్కర్

అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదుల నేపథ్యంలో పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం వాషిమ్‌కు బదిలీ చేసింది. పూణే కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖ ద్వారా ప్రాంప్ట్ చేయబడిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఖేద్కర్ ఇప్పుడు వాషిమ్ జిల్లాలో సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఖేద్కర్‌ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన సొంత ఆడి కారుకు రెడ్-బ్లూ  బీకన్‌ లైట్లు, వీఐపీ నంబర్ ప్లేట్‌ ఏర్పాటుచేసుకున్నారు. అంతేకాదు, కారుకు ముందు, వెనుక మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్‌ సైతం అంటించారు. పోనీ, ట్రైనీ కలెక్టరమ్మా ఇక్కడితో ఆగిందా..! అదీ లేదు. తనకు వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బంది ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేసింది. తన పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డులు, నేమ్‌ప్లేట్, రాజముద్రలు సిద్ధం చేసి తనకు అందించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించింది. 

ఈ విషయాన్ని కిందస్థాయి సిబ్బంది కలెక్టర్‌ కు తెలపడంతో.. ఆయన చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో, ఆమెను పుణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. ప్రొబేషన్‌ కాలం పూర్తయ్యే వరకు ఆమె వాషిమ్ జిల్లాలో సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా, 2023 బ్యాచ్‌‌కు పూజా ఖేద్కర్‌ UPSCలో 841 ర్యాంక్‌ సాధించారు.