
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఆయన ఫ్యాన్స్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పునీత్ చనిపోయారు. దీంతో పునీత్ ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా ఆయన ఫ్యామిలీ డాక్టర్ రమణ రావుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పునీత్ చనిపోయాడంటూ..ఆయన అభిమానులు కొందరు బెంగుళూరులోని సదాశివనగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఫ్యాన్స్ చేస్తున్న ఆరోపణలపై ప్రైవేట్ హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్( PHANA) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైద్యులపై ఇలాంటి ఆరోపణలు సరికాదని పేర్కొంది. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసన్న కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మయిని కూడా కోరారు.
పునీత్‌కు ఫ్యామిలీ డాక్టర్ రమణ రావు సరైన వైద్యం అందించారన్నారు ప్రసన్న. చావును ఎవరూ ఆపలేరని... డాక్టర్ల ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు ప్రయత్నిస్తారన్నారు. డాక్టర్ రమణరావుకు సెక్యూరిటీ పెంచాలని కూడా సీఎంను కోరారు. దీంతో పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత పెంచారు. సదాశివనగర్‌లో నివసిందే డాక్టర్ ఇంటి వద్ద, క్లీనిక్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్‌కు ఎలాంటి అనారోగ్య సమస్య లేదన్నారు. తన క్లీనిక్‌కు వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్స చేశామన్నారు. పునీత్ డాక్టర్ రమణ రావు మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 29న ఏం జరిగిందో వివరించారు.
పునీత్ తన భార్య అశ్వినితో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో పునీత్ తనకు చాలా నీరసంగా ఉందని చెప్పాడు. అయితే అతని నోటి నుంచి నేను ఎప్పుడూ నీరసం అనే పదాన్నే వినలేదన్నారు. బీపీ కూడా నార్మల్‌గానే ఉంది. హార్ట్ బీట్ కూడా స్థిరంగానే ఉంది. అయితే పునీత్‌కు ఫుల్‌గా చెమటలు పట్టాయి. అయితే తనకు వ్యాయామం చేసిన తర్వాత ఇలానే చెమటలు పడతాయన్నాడు. ఏది ఏమైనా ఈసీజీ తీద్దామని నేను చెప్పానన్నారు. ఆ తర్వాత ఈసీజీలో స్ట్రెయిన్ గమనించిన వెంటనే పునీత్‌ను విక్రమ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అతని భార్య అశ్వినికి చెప్పానని డాక్టర్ రమణా రావు తెలిపారు. అక్టోబర్ 29 ఉదయం 11.40 నిమిషాలకు పునీత్ విక్రమ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ వైద్యులు అతనికి చికిత్స చేస్తుండగానే.. మధ్యాహ్నం రెండున్నర గంటలకు పునీత మృతి చెందాడని నిర్ధారించారు.