కేంద్రానికి అన్నదాతల గోస పట్టదా?

కేంద్రానికి అన్నదాతల గోస పట్టదా?

రైతుల పోరు ఢిల్లీ బార్డర్​లకు ఆవల ఢిల్లీ చేరే లక్ష్యంతో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రైతుల మీద డ్రోన్​లతో,  టియర్ గ్యాస్​తో, రబ్బర్ బుల్లెట్లతో దాడులు కొనసాగాయి. శంబు, టికిరి తదితర బార్డర్లలో కాంక్రిట్​తో బారికేడ్లు నిర్మించారు. పారా మిలిటరీ ఫోర్స్​ను దింపారు. 150 మంది రైతులకు గాయాలు అయ్యాయి. ఒక రైతు ఊపిరి కోల్పోయాడు.  ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు ఫలించడం లేదు. ఈ నెల 21 న  రైతు సంఘాలు మరోసారి ఢిల్లీకి చలో అంటూ భారీ ర్యాలీ  చేపట్టనున్నాయి. దేశ జనాభాలో 70 శాతం మంది గ్రామీణ ప్రజల్లో ముఖ్య భాగంగా ఉంటున్న రైతన్నలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. వారి 'ఘోష' ను పాలకులు పట్టించుకోవడం లేదు. దేశంలోని ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ యోజనకు అర్హులైన రైతుల సంఖ్య 13,85,40,234గా ఉంది. మొత్తంగా వీరిపై రుణం తీసుకున్న భారం 16, 80, 366 కోట్ల రూపాయలు ఉంది.  ఒక్కో రైతు నెత్తిన భారం యావరేజ్​గా రూ.1, 21,290 ఉంది.

పీఎం రైతు సమ్మాన్ యోజనలో పేరు నమోదుకాని 6 కోట్ల మందికి పైగా రైతులపై ప్రైవేట్ అప్పుల భారం 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రుణమాఫీ అనేది కార్పొరేట్లకే పరిమితం అయింది.  రైతులకు రుణ మాఫీ ఓ ప్రహసనమైంది.  ఒడిశా, పంజాబ్. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో  రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కాస్తో కూస్తో అండగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా,  రైతులకు వ్యతిరేకంగా ఉన్న మూడు చట్టాలను రద్దు చేయాలని 378 రోజులు  రైతులు ఢిల్లీ బార్డర్లలో ఆందోళన చేశారు.  ఎట్టకేలకు మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేశారు. ఎమ్మెస్పీని కూడా చట్ట రూపం ఇచ్చి అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో750 మందికి పైగా రైతులు బార్డర్లలో మరణించిన దాఖలాలు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. 

కాల్పుల విచారణ రిపోర్టు బుట్టదాఖలు

మన్సోర్ లో 2017లో  పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. సంఘటన పై విచారణ చేపట్టి చాలా హడావిడి చేశారు. అందరూ మర్చిపోయాక విచారణ రిపోర్టును బుట్ట దాఖలు చేశారు. యూపీలోని లఖిమ్ పూర్ ఖేరిలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు కారుతో ఢీకొట్టి నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ప్రాణాలు తీశాడు. ఈ సంఘటనల మీద పీఎం నరేంద్ర మోదీ ఒక్క మాట మాట్లాడలేదు. మంత్రి ఇంకా అయన మంత్రి మండలిలో కొనసాగుతూనే ఉన్నాడు. ఇదీ అన్న దాతల పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం  వైఖరి.  ఉద్యమం సందర్భంగా రైతుల మీద పెట్టిన కేసుల ఎత్తివేత జరగలేదు. 10 వేల మందికి పైగా కేసుల్లో ఉన్నారు.  విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఎలాగైనా రైతుల ఉద్యమాలను హింసాత్మకం అనే ముద్ర వేసి రైతులను మానసికంగా బలహీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్ని ప్రణాళిక ప్రకారం పలుమార్లు రైతు ఉద్యమం మీద దాడి చేస్తున్నది.

రైతులను టెర్రరిస్టులుగా ప్రచారం

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లలో రైతులు పోరాడినపుడు నక్సల్స్, టెర్రరిస్టులు అంటూ ఉద్యమంపై ప్రచారం జరిగింది.  కొందరి మీద దేశ ద్రోహం ముద్ర వేసి కేసులు కూడా పెట్టారు. మద్దతు ఇచ్చినవారిని అరెస్టు చేసి జైళ్లల్లో  పెట్టారు.  ఇలా రైతులను వారి ఉద్యమాన్ని రకరకాలుగా ఇబ్బందులపాలు చేయడం జరిగింది. దేశంలోని140 కోట్ల మంది ప్రజల కోసం కష్టపడి ధాన్యం పండిస్తున్నవారు అప్పుల ఊబిలో చిక్కుకొని తనువు చాలిస్తున్న పరిస్థితి ఏర్పడింది.  దేశంలో రైతు పంటకు కార్పొరేట్లు పిడికెడు ఇస్తూ పుట్టెడు సంపాదిస్తున్నారు. 

రిటైల్ మార్కెట్​లో 64లక్షల 66 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఇది 2024నాటికి 85లక్షల కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. కిసాన్ ఆందోళన కొనసాగిన ఘాజిపూర్ లో 80 శాతం రిటైల్ మార్కెట్ గ్రోత్ పెరిగింది. ఈ బార్డర్లో 378 రోజులు  రైతులు సత్యాగ్రహం చేశారు. అంతెందుకు హిమాచల్ ప్రదేశ్​లో యాపిల్ భారీగా పండుతుంది. రైతుకు కిలోకు రూ.5, 6 .ఇచ్చి రూ.100 నుంచి 250 రూపాయలకు కిలో అమ్ముతున్నారు. శనగలు కూడా కిలో రూ.34, రూ36కు కొని రూ.250కి అమ్ముతున్నారు. 

రిటైల్​ మార్కెట్లో పంటలకు భారీ ధరలు

మొత్తానికి కార్పొరేట్ల చేతుల్లో దేశాన్ని పెట్టేసే కుట్రకు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టేసింది.  రైతును కాపాడుకోవాలి.  రైతుల హస్తాల నుంచి వ్యవసాయ రంగాన్ని దూరం కాకుండా చూసుకోవాలి. కార్పొరేట్​లకు అప్పజెప్పే కుట్ర, వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ  ఇంకా ఆ కుట్ర లోపాయికారిగా కొనసాగుతుందనే భయం అన్నదాతలకు ఉన్నది.  రైతులు తమ హక్కుల కోసం చేసే ప్రతి ఉద్యమానికి మద్దతు ఇవ్వడం దేశంలోని ప్రతి పౌరుడి నైతిక బాధ్యత. హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడుతున్నది. హక్కులను అడిగే గొంతుకలను నలిపివేసి..ఈ దేశం ఆత్మ అయిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రం పని చేస్తున్నది. దేశ ప్రజల మనోభావాలను విరుద్ధంగా పాలన చేస్తున్న ప్రభుత్వానికి సోయి వచ్చే వరకు,  కేసులు మాఫీ చేసే వరకు,  తాము కోరిన ఎమ్మెస్పీ వచ్చేదాకా పోరాటం ఆగదని  కొనసాగుతుందని రైతన్నలు పేర్కొంటున్నారు.  జై కిసాన్. జై జవాన్!.

- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్