పంజాబ్ సీఎం కాన్వాయ్‌ని ఆపిన అగ్నిపథ్‌ ఆందోళనకారుడు

పంజాబ్ సీఎం కాన్వాయ్‌ని ఆపిన అగ్నిపథ్‌ ఆందోళనకారుడు

అమృత్‌సర్‌ : అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఉధృతంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే..పంజాబ్‌లో మాత్రం ఓ ఆసక్తికర ఘటన జరిగింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సంగ్రూర్‌ ఉపఎన్నికల్లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కారు రూఫ్‌టాప్‌ నుంచి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై నిల్చున్న ఓ యువకుడు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాడు. అతడిని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే తన కాన్వాయ్‌ ఆపారు.

సీఎం  భగవంత్‌ మాన్‌ దగ్గరకు వెళ్లిన ఆ యువకుడు ‘అగ్నిపథ్‌ను అమలు చేయడానికంటే ముందే.. అందరు నాయకులు దాని గురించి చర్చించండి’ అని కోరాడు. దీంతో అగ్నిపథ్‌పై ఎంపీలు ఒకవేళ సమావేశం నిర్వహిస్తే తానే స్వయంగా వెళ్తానని సీఎం అతడికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తన కాన్వాయ్‌లో ముందుకు కదిలారు. ఈ వీడియోను ఆమ్‌ఆద్మీ పార్టీ ట్విటర్​ లో షేర్‌ చేసింది.