మరో సంచలన నిర్ణయం తీసుకున్న భగవంత్ మాన్

మరో సంచలన నిర్ణయం తీసుకున్న భగవంత్ మాన్

చండీగఢ్: ఎమ్మెల్యేల పెన్షన్ విషయంలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్యేల్యేలకు ఒకే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఇకపై ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఫ్యామిలీ పెన్షన్లోనూ కోత విధిస్తున్నట్లు చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు ఒకసారికి మించి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతుండటంతో పదవీకాలం ముగిసిన ప్రతిసారీ వారికి కొత్తగా మరో పెన్షన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో ఒక్కొక్కరు  రూ.3.50 లక్షల నుంచి రూ.5.25 లక్షలు పెన్షన్ గా అందుకుంటున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు భారంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలలో  కొందరు ఎంపీలుగానూ కొనసాగుతున్నారు. వారు పార్లమెంట్ సభ్యుడిగా సేవ చేసినందుకు ఆ పెన్షన్ కూడా అందుకుంటున్నారని భగవంత్ మాన్ చెప్పారు. ఈ కారణంగానే ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఇలా ఆదా అయిన మొత్తాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించనున్నట్లు సీఎం ప్రకటించారు. 

‘రాజకీయ క్షేత్రంలో ప్రజలకు సేవ చేస్తామని చేతులు జోడించి నేతలు ఓట్లు అడుగుతారు. కానీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాక మాత్రం లక్షల రూపాయలు పెన్షన్గా అందుకుంటున్నారు. ఇలా తీసుకునే వారిలో చాలా మంది అసెంబ్లీకి కూడా రారు. అని సీఎం భగవంత్ మాన్ అన్నారు.