గవర్నర్‌ను కలిసిన భగవంత్ మాన్

గవర్నర్‌ను కలిసిన భగవంత్ మాన్

పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన భగవంత్ మాన్ గవర్నర్‌ను కలిశారు. చండీగఢ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ గవర్నర్‌కు వినతి పత్రం అందించారు. మార్చి 16న ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు ఈనెల 13వ తేదీన అమృత్ సర్ లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు. 

ఈ సందర్భంగా భగవంత్ మాన్ మాట్లాడుతూ... తాను ప్రభుత్వాన్ని కలిశానన్నారు. మా ఎమ్మెల్యేల నుండి మద్దతు లేఖను అందజేశానని తెలిపారు.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ఎక్కడ ప్రమాణ స్వీకారోత్సవం చేయాలనుకున్నానో గవర్నర్ చెప్పాలన్నారు. మార్చి 16న మధ్యాహ్నం 12.30 గంటలకు ఖట్కర్ కలాన్‌లోని భగత్ సింగ్ స్వగ్రామంలో సీఎంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. పంజాబ్‌ ప్రజలు ఈ వేడుకకు వస్తారన్నారు. వారు కూడా భగత్ సింగ్‌కు నివాళులర్పిస్తారని భగవంత్ మాన్ తెలిపారు. మనకు మంచి క్యాబినెట్ ఉంటుంది, చారిత్రాత్మక నిర్ణయాలు - మునుపెన్నడూ తీసుకోనివి తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రజలంతా వేచి ఉండాలన్నారు. 

అయితే రాజ్‌భవన్‌లో కాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన నవాన్‌షహర్ జిల్లాలోని ఖట్కర్‌కలన్‌లో తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా భగవంత్ మాన్ వెల్లడించారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర సీఎంగా ఉన్న చరణ్ జీత్ సింగ్ చన్నీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు.