రైతుబంధు కోసం గుంటల లెక్కన కొనుగోళ్లు

రైతుబంధు కోసం గుంటల లెక్కన కొనుగోళ్లు

యాదాద్రి, వెలుగు: గవర్నమెంట్​అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా స్కీం కారణంగా రైతుల సంఖ్య పెరుగుతోంది. రైతుబంధును 5 లేదా 10 ఎకరాల రైతులకే పరిమితం చేస్తారన్న ప్రచారం జరగడం, రెండు మూడు గుంటలున్నా రైతుబంధు వర్తించడంతో పొలాలను పంచి.. పెద్ద రైతులు వారసుల పేర రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరికొందరు రెండు మూడు గుంటల భూమి కొనుక్కుని ఫామ్స్​ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో యాదాద్రి జిల్లాలో రైతుల సంఖ్య నాలుగేళ్లలో బాగా పెరిగింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో 2018 ఎన్నికలకు ముందు మే నెలలో సీఎం కేసీఆర్ రైతుబంధు స్కీం ప్రవేశపెట్టారు. మొదట ఎకరానికి రూ. 4 వేల చొప్పున సాయం అందించగా.. రెండు సీజన్ల తర్వాత ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఇవ్వడం ప్రారంభించింది. ఈ స్కీంతో పాటు రైతు బీమా కూడా స్టేట్​గవర్నమెంట్ అమలు చేస్తోంది. మరోవైపు పెద్ద రైతులకు రైతుబంధు కట్ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఎవరి పేరు మీద భూమి ఉంటే ఆ ఒక్కరే రైతు బీమాకు అర్హులుగా ఉన్నారు. దీంతో పెద్ద రైతులతో పాటు పది ఎకరాలు అంతకంటే తక్కువగా ఉన్న రైతులు కూడా అలర్ట్ అయ్యారు. తమ పేరుపై ఉన్న భూమిని వారసుల పేర్లపైకి మార్చేస్తున్నారు. దీంతో రైతుల సంఖ్య పెరుగుతోంది. 

పెరిగిన రైతులు 83 వేల మంది

అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్​ లెక్కల ప్రకారం  జిల్లాలో 6,07,745 ఎకరాల సాగు భూమి ఉంది. రైతుబంధు స్కీం ప్రారంభించిన 2018లో రైతుల సంఖ్య 1,71,852 ఉండగా 5.09 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు పేర్కొన్నారు. ఒక్కో సీజన్​లో తగ్గుతూ పెరుగుతూ ఈ వానాకాలం సీజన్ నాటికి రైతుల సంఖ్య  2,54,977 మందికి చేరింది. ఈ లెక్కన 83,125 మంది పెరగగా, భూమి కూడా మరో 98 వేల ఎకరాలు పెరిగింది.  పెరిగిన రైతుల సంఖ్యలో 33,384 మంది ఈ ఆరు నెలల్లో పెరిగినవారే. పెరిగిన 98 వేల ఎకరాల్లో కొందరు డిజిటలైజేషన్ చేయించుకోవడం, కోర్టు కేసులతో పాటు బ్లాక్ లిస్టులో ఉన్న భూములకు తిరిగి పాస్ బుక్​లు రావడంతో వారంతా రైతుబంధుకు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సీజన్​లో 2,54,977 మంది రైతులకు రూ. 303 కోట్ల 87 లక్షల 29,215 అందించనున్నారు. 

ఒక్కో రైతుకు సగటున రూ. 2,832

2022 వానాకాలం సీజన్ మొదటి రోజున జిల్లాలో ఎకరం లోపు భూమి ఉన్న 68,780 మంది రైతులకు రూ. 19 కోట్ల 47 లక్షల 83,125 జమైంది. ఈ రైతుల్లో ఎకరం, అరెకరం, గుంటల భూమి ఉన్నవారు ఉన్నారు. సగటున ఒక్కో రైతుకు రూ. 2, 832  ఖాతాలో పడినట్టుగా అర్థమవుతోంది. ఈ సొమ్ము జమ అయిన ఖాతాల్లో చాలామంది కొత్తగా  గుంటల లెక్క భూమి కొనుగోలు చేసినవారు ఉన్నారని తెలుస్తోంది. 

మారిన ‘రియల్’​ తీరు

కొంతకాలంగా రియల్ ఎస్టేట్ తీరు మారింది. భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో ఎకరాల చొప్పున కొనుగోళ్లు తగ్గాయి. దీంతో జిల్లాలోని కొందరు వ్యాపారులు భూమిని గుంటల లెక్కన అమ్మేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 నుంచి 10 గుంటల వరకు అమ్మేశారు. గుంటల లెక్కన భూమి కొన్నవారికి కూడా రైతుబంధు వస్తుందని, రైతు బీమాకు అర్హులని ప్రచారం చేయడంతో ఈ తరహా కొనుగోళ్లు జిల్లాలో జరిగాయి. దీంతో జిల్లాలో రైతుల సంఖ్య  పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంఖ్య హఠాత్తుగా పెరగడంతో మేలుకున్న ప్రభుత్వం గుంటల లెక్కన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆర్డర్ వేసింది. దీనికి తోడు ఒకే సర్వే నంబర్ లేదా పక్క పక్క సర్వే నంబర్లలో గుంటల లెక్కన భూమి రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు సర్వే కూడా చేయిస్తున్నారు.