భువనేశ్వర్: పూరీ జగన్నాథ స్వామిపై పూరీ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీ అనంతం సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని మోదీకి పూరీ జగన్నాథ స్వామి భక్తుడు అని కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ..సంబిత్ పాత్రతో పాటు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. సంబిత్ పాత్ర కామెంట్ పై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. " పూరీ జగన్నాథుడు విశ్వానికే ప్రభువు. అటువంటి దేవుడినే మోదీకి భక్తుడని అనటం భగవంతుడిని కించపరచడమే.
సంబిత్ పాత్ర కామెంట్లు జగన్నాథునికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. ఒడియాల విశ్వాసాన్ని కించపరిచాయి"అని మండిపడ్డారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.."బీజేపీ అధికార మత్తులో ఉంది. అందుకే మన దేవుళ్లను కూడా విడిచిపెట్టడం లేదు. ఇక ప్రజలను మాత్రం ఎలా విడిచిపెడుతుంది. పూరీ జగన్నాథ స్వామిపై సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలను ఖండింస్తున్నాం. జూన్ 4న ప్రజల సంకల్పం ముందు బీజేపీ అహంకారం నాశనం అవుతుంది" అని పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పిన సంబిత్ పాత్ర
తన కామెంట్లకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర స్పందించారు. " నేను చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. ప్రధాని మోదీ ఎన్నికల రోడ్ షో తర్వాత పలు మీడియా చానెళ్లతో మాట్లాడాను. అన్నిచోట్ల మోదీ.. పూరీ జగన్నాథుడికి పరమభక్తుడు అని చెప్పాను. కానీ ఒక్కచోట మాట్లాడుతూ అందుకు విరుద్ధంగా స్పందించాను. అది అనుకోకుండా జరిగిన తప్పు. కానీ ఇది కొందరిని బాధించి ఉంటుంది. దేవుడు కూడా అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. నోరు జారినందుకు నేను జగన్నాథ స్వామి పాదాల వద్ద క్షమాపణలు కోరుతున్నాను. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మూడు రోజుల పాటు ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నాను" అంటూ సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు.
