శ్రీశైలం ఆలయ క్యూలైన్​లో పునుగు పిల్లి

శ్రీశైలం ఆలయ క్యూలైన్​లో పునుగు పిల్లి

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం దేవస్థానంలో  సోమవారం మధ్యాహ్నం స్వామివారి, అమ్మవారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించింది.  ఈ విషయాన్ని వారు ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడి చేరుకున్న సిబ్బంది పునుగు పిల్లిని సెల్​ఫోన్​లో చిత్రీకరించారు. కొద్దిసేపటికి అది వెళ్లిపోయింది. కాగా, క్యూలైన్ ఏర్పాటుకు ముందు గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా పునుగు పిల్లుల సందడి చేసేవని స్థానికులు చెప్తున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో క్యూలైన్లను అభివృద్ధి చేశారని, దీంతో పునుగు పిల్లుల జాడ తగ్గిపోయిందని అంటున్నారు. ఇవి అరుదుగా కనిపిస్తాయి.

పునుగు పిల్లి ప్రత్యేకత ఇది..

పునుగు పిల్లి  వివేరిడే జంతు కుటుంబానికి చెందింది.  పునుగు పిల్లుల్లో 38 జాతులు ఉన్నాయి. ఆసియా రకానికి విశిష్టత ఉంది.  దీని శరీరం నుంచి జవాది , పునుగు అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా  శేషాచలం(తిరుపతి) అడవుల్లో కనిపిస్తాయి. ఈ పిల్లి నుంచి తీసే తైలాన్ని తిరుమల శ్రీవారి మూల విరాట్టుకు పూస్తారు. ప్రతీ పది రోజులకు ఓసారి ఈ పునుగుపిల్లి చర్మంపై బుడిపెల లాంటివి వస్తాయి వాటి నుంచి సువాసన వచ్చే తైలం వస్తుంది. అలాగే ఒళ్లు నొప్పులను తగ్గించడంలో వాడతారు.  ఎన్నో ఉపయోగాలున్న ఈ తైలానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.