గ్రామాల అభివృద్ధే ప్రధాని మోడీ లక్ష్యం

గ్రామాల అభివృద్ధే ప్రధాని మోడీ లక్ష్యం
  • కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల

జహీరాబాద్, వెలుగు:  దేశంలోని మారుమూల గ్రామాలు, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధే ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి పరుషోత్తం రూపాల చెప్పారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ సర్పంచులు ఇంతకుముందు చిన్నచిన్న అవసరాలకు కూడా ఎమ్మెల్యే, ఎంపీలకు చేయిచాచాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం కేంద్రం నేరుగా పంచాయతీ అకౌంట్లోనే డబ్బులు జమ చేస్తోందని చెప్పారు.

 దేశంలో 2014కు ముందు 6వేల పంచాయతీలకే భవనాలు ఉండేవని, మోడీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది ఏళ్లలో 30 వేల జీపీలకు భవనాలు నిర్మించామని వివరించారు. జీపీ భవనాలతో పాటు దేశ రాజధానిలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించారని చెప్పారు.  వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి మోడీ కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగానే మూడు నెలలకోసారి కేంద్ర మంత్రులు పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నారని వెల్లడించారు.  తుపాకీ కూడా తయారు చేయలేని దేశాన్ని విదేశాలకు యుద్ధ సామాగ్రి పంపే స్థాయికి తెచ్చారని కొనియాడారు. 

రైల్వే స్టేషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి

జహీరాబాద్‌లోని రైల్వే స్టేషన్‌ను ఆదివారం కేంద్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి పరుషోత్తం రూపాల సందర్శించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రైళ్ల రాకపోకల వివరాలను రైల్వే స్టేషన్ మాస్టర్ మాధవ కృష్ణను అడిగి తెలుసుకున్నారు.  ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాల గురించి ఆరా చేశారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడ సంగప్ప, బీజేపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్ రెడ్డి, నవబాద్ జగన్నాథ్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ చందర్ రాజనర్సింహ, పార్లమెంట్ కోర్ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, సుధీర్ కుమార్, మల్లికార్జున్ పటేల్,  జనార్దన్ రెడ్డి,  పొద్దుటూరి శ్రీనివాస్ గుప్తా, అశోక్ బెల్కేరి, సుధీర్ బండారి, నరేశ్ పటేల్, పూల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.