పుష్ప 2 తొక్కిసలాట కేసు..సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ నోటీసులు

పుష్ప 2 తొక్కిసలాట కేసు..సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ నోటీసులు

 

  • సంధ్య థియేటర్‌‌ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
  • మృతురాలు రేవతి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలి
  • భారీ సంఖ్యలో జనం వస్తారని తెలిసి, భద్రత ఎందుకు కల్పించలేదు 
  • ప్రజల ప్రాణాలు కాపాడటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు
  • కేసు దర్యాప్తుకు సంబంధించి ఆరు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం 

హైదరాబాద్‌, వెలుగు: పుష్ప 2 సినిమా బెనిఫిట్‌ షో తొక్కిసలాట ఘటనలో సీఎస్‌ రామకృష్ణారావుకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌‌సీ) బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో రేవతి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పింది. అలాగే, బాధితులకు రూ.5 లక్షల పరిహారం చెల్లించేలా సర్కార్‌‌కు ఆదేశాలిస్తామని తెలిపింది.  మానవ హక్కుల రక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 18 ప్రకారం పరిహారాన్ని కమిషన్‌‌‌‌‌‌‌‌ ఎందుకు సిఫార్సు చేయకూడదో వివరణ ఇవ్వాలని సీఎస్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. దీంతో పాటు ప్రస్తుతం కేసు దర్యాప్తుకు సంబంధించి సమగ్ర నివేదికను ఆరు వారాల్లోగా అందించాలని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సిటీ అడిషనల్ కమిషనర్ (లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్)కు ఆదేశాలు జారీ చేసింది. ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు పెద్ద సంఖ్యలో జనం వస్తారని తెలిసి కూడా భద్రతా చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తమ విచారణలో తేలిందని కమిషన్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4న పుష్ప 2 బెన్‌‌‌‌‌‌‌‌ఫిట్‌‌‌‌‌‌‌‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌‌‌‌‌‌‌‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాటకు బాధ్యుడిగా నటుడు అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ను 11వ నిందితుడిగా చేర్చారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13న ఆయనను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి, రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

బందోబస్తులో పోలీసులు విఫలం.. 

సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన తొక్కిసలాట, లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌ సహా రేవతి మృతికి సంబంధించి న్యాయవాది రామారావు ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో ఫిర్యాదు చేశారు. రామారావుతో పాటు మరికొంత మంది కూడా ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీని ఆశ్రయించారు. ఫిర్యాదుల ఆధారంగా కమిషన్‌‌‌‌‌‌‌‌ విచారణ చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సిటీ అడిషనల్‌‌‌‌‌‌‌‌ సీపీ (లా అండ్ ఆర్డర్) ఈ ఏడాది మార్చి 20న రిపోర్ట్, జూన్‌‌‌‌‌‌‌‌ 14న నివేదికలను కమిషన్‌‌‌‌‌‌‌‌కు అందజేశారు. పుష్ప 2 ప్రీరిలీజ్ కోసం సంధ్య 70 ఎంఎం, 35 ఎంఎం, సుదర్శన్‌‌‌‌‌‌‌‌ 35 ఎంఎం, దేవి 70 ఎంఎంలో అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. 

ప్రజా భద్రత నేపథ్యంలో అల్లు అర్జున్ సహా నటులు ఎవ్వరూ సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చేందుకు గాని, రోడ్‌‌‌‌‌‌‌‌ షోకు గాని అనుమతులు ఇవ్వలేదని సిటీ పోలీసులు తెలిపారు. ఈ విషయంలో థియేటర్ యాజమాన్యానికి కూడా లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాశామని చెప్పారు. బెనిఫిట్‌‌‌‌‌‌‌‌ షోకు పెద్ద సంఖ్యలో జనం వచ్చినందున వారిని కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేయడం సాధ్యం కాలేదని, దీంతో తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనలో రేవతి చనిపోయినట్లు ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీకి సిటీ పోలీసులు వివరించారు. జనం పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినప్పటికీ అందుకు అనుగుణంగా ఎందుకు బందోబస్తు కల్పించలేదని పోలీసులపై కమిషన్‌‌‌‌‌‌‌‌ అసహనం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు కాపాడడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తమ విచారణలో గుర్తించినట్లు తెలిపింది. దీనికి ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేస్తూ మృతురాలి కుటుంబానికి రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఎందుకు సిఫార్సు చేయకూడదో చెప్పాలని సీఎస్‌‌‌‌‌‌‌‌కు నోటీసులు జారీ చేసింది.