
తమిళనాడులో టీవీ ఛానెళ్లపై నియంతృత్వం కొనసాగుతుంది. తమిళనాడు రాష్ట్రంలో ప్రజాదరణ పొందిన 24 గంటల న్యూస్ ఛానెల్ పుతియా తలైమురై టీవీ ఛానెల్ ను.. ప్రభుత్వ అరసు కేబుల్ నెట్ వర్క్ నుంచి తొలగించింది అక్కడి సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే ప్రభుత్వం. ఛానెల్ ప్రసారాలను నిలిపివేసింది. ఈ అంశంపై ప్రశ్నించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది పుతియా తలైమురై ఛానెల్ యాజమాన్యం.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని అరస నెట్ వర్క్ లో ఛానెల్ నెంబర్ 44లో పుతియా తలైమురై ఛానెల్ ప్రసారం అవుతుంది. 2025, అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి ఈ ప్రసారాలను నిలిపివేసింది డీఎంకే ప్రభుత్వం. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్లు కంప్లయింట్స్ చేస్తున్నా.. జనం నుంచి ఒత్తిడి వస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే.. ప్రభుత్వం కక్ష్యపూరితంగానే.. ఉద్దేశపూర్వంగా.. కావాలనే ఛానెల్ నిలిపివేసినట్లు స్పష్టం అవుతుంది.
నాలుగు రోజులుగా పుతియా తలైమురై ఛానెల్ సాంకేతిక, నెట్ వర్క్ సిబ్బంది.. ఆరసు కేబుల్ కార్పొరేషన్ అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ.. ఇప్పటివరకు ఎటువంటి వివరణ లేదా ప్రకటన వెలువడలేదు. నాలుగు రోజుల నిరంతర సంభాషణ తర్వాత కూడా అధికారుల నుంచి పూర్తి మౌనం కొనసాగుతోంది. ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఆందోళన కలిగిస్తుందని యాజమాన్యం వెల్లడించింది. ప్రజా నిధులతో నడిచే కేబుల్ సేవా సంస్థలు అన్ని లైసెన్సు పొందిన టెలివిజన్ చానళ్లకు సమానంగా, భేదాభిప్రాయం లేకుండా సేవలందించాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు ఈ అంశం స్పష్టం చేస్తోంది. ఏవైనా స్పష్టీకరణ లేకుండా ప్రసారాన్ని అడ్డుకోవడం లేదా ఆపివేయడం మీడియా స్వేచ్ఛ, ప్రజా సేవా నిబద్ధత మరియు ప్రజల సమాచార హక్కుపై దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుందని మీడియా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
.
పుతియా తలైమురై తన ఆవిర్భావం నుంచి స్వతంత్ర, వాస్తవాధారిత, ప్రజా కేంద్రిత జర్నలిజానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తూ వచ్చింది. ప్రజల సమస్యలను ప్రతిబింబించడం, వివిధ వాదనలను సమతుల్యంగా ప్రదర్శించడం ద్వారా తమిళనాడు ప్రజల్లో ఈ చానల్ అపార విశ్వాసాన్ని సాధించింది. ఈ క్రమంలోనే పుతియా తలైమురై ప్రసారం నిలిపివేయబడిన ఘటన స్వతంత్ర మీడియా సంస్థ స్వేచ్ఛా కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యగా కనబడుతుందిని.. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా చెబుతున్నాయి మీడియా సంఘాలు.
కార్యాచరణకు పిలుపు :
తమిళనాడు ప్రభుత్వం ఈ బ్లాకౌట్‌కు ఎలాంటి ఆదేశం లేదా సాంకేతిక జోక్యం కారణమా అనే దానిపై వెంటనే స్పష్టత ఇవ్వాలి.
తమిళనాడు ఆరసు కేబుల్ టీవీ కార్పొరేషన్ తక్షణమే పుతియా తలైమురై ఛానెల్ ప్రసారాన్ని పునరుద్ధరించి, ఈ అవరోధంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి.
సంబంధిత నియంత్రణ సంస్థలు మరియు పరిశ్రమ వర్గాలు ఈ ఘటనను గమనించి, ప్రజా నెట్‌వర్క్‌పై న్యాయసమ్మతమైన, వివక్ష రహిత ప్రసార హక్కును కాపాడాలని నిర్ధారించాలి.
ప్రెస్ స్వేచ్ఛ ఒక ప్రత్యేక హక్కు కాదు — అది భారత రాజ్యాంగ హామీ ఇచ్చిన మౌలిక హక్కు, ప్రజాస్వామ్యానికి మూలాధారం. ఈ హక్కును అడ్డుకునే ఏ చర్య అయినా, ఉద్దేశపూర్వకమైనదైనా లేకపోయినా, అత్యంత గంభీరంగా పరిగణించబడాలి.