ఉక్రెయిన్ కథ ముగిసింది..ఇక పోలండ్ వంతు!

ఉక్రెయిన్ కథ ముగిసింది..ఇక పోలండ్ వంతు!
  • పుతిన్ ఆదేశిస్తే ఆరు సెకన్లలో సత్తా చూపిస్తామని కామెంట్
  • ట్విట్టర్ లో వీడియో వైరల్ 

కీవ్/మాస్కో : ‘‘ఉక్రెయిన్ సమస్య ముగిసింది. తర్వాత పోలండే. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాకు ఆదేశాలు ఇచ్చినట్లయితే.. ఆరు సెకన్లలో మేం ఏం చేయగలమో చూపిస్తాం’’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుచరుడు, చెచెన్యా లీడర్ రంజాన్ కదిరోవ్ అన్నారు. రష్యాలోని చెచెన్యా ప్రాంతానికి హెడ్ గా ఉన్న కదిరోవ్ మొదటి నుంచీ ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా పోలండ్​ను ఉద్దేశించి ఆయన బెదిరింపు ధోరణిలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉక్రెయిన్​కు సరఫరా చేసిన ఆయుధాలు, కిరాయి సైనికులను వెనక్కి తీసుకోవాలని పోలండ్​ను డిమాండ్ చేశారు. ఇటీవల విక్టరీ డే సందర్భంగా రష్యా రాయబారిపై ఇంక్​తో దాడి చేసిన ఘటనను ప్రస్తావించిన కదిరోవ్.. తమ రాయబారి పట్ల ప్రవర్తించిన తీరుకు అధికారికంగా క్షమాపణలు చెప్పాలన్నారు. దీనిని మర్చిపోబోమని స్పష్టం చేశారు.  కాగా, ఉక్రెయిన్ లో వెయ్యి మంది చెచెన్ మనుషులు ఉన్నారని కదిరోవ్ గత మార్చిలోనే వెల్లడించారు. డాన్బాస్ లో పుతిన్ అనుకూల వేర్పాటువాదులకు కూడా ఆయన మద్దతు ఉంది. ఉక్రెయిన్ కు చెందిన క్రిమియా ఆక్రమణ సమయంలో కూడా రష్యా తోడ్పాటు ఉన్న రెబెల్స్​కు కదిరోవ్ సపోర్ట్ చేశారు.   

ఇది1938 కాదు.. 2022: జెలెన్ స్కీ 
రష్యాతో యుద్ధానికి ముగింపు పలకాలంటే తమ భూభాగాన్ని వదులుకోవాలంటూ కొందరు సలహాలు ఇస్తున్నారని, ఇది 1938 కాదని, 2022 అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ అన్నారు. భూభాగాన్ని వదులుకుని, బతిమాలుకోవడం అనేది 1938లో నాజీలు అనుసరించిన విధానమన్నారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ చేసిన సూచనలను ప్రస్తావిస్తూ.. జెలెన్ స్కీ ఈ కామెంట్లు చేశారు. ఇది 1938 కాదు.. 2022 అనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. కాగా, డాన్బాస్ రీజియన్​లోని 40 పట్టణాలపై రష్యా షెల్లింగ్​ను కొనసాగిస్తోంది. సామాన్యులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గాన్ని మూసేస్తామంటూ రష్యా హెచ్చరిస్తోందని ఉక్రెయిన్​ మిలిటరీ ఆరోపించింది. రష్యా దాడుల వల్ల ఖార్కివ్​లో నలుగురు చనిపోయారని ఆ రీజియన్ గవర్నర్ వెల్లడించారు. మరోవైపు యుద్ధ నేరాలకు సంబంధించి మరో ఇద్దరు రష్యన్​ సైనికులపై ఉక్రెయిన్​కోర్టులో విచారణ కొనసాగుతోంది. వారికి 12 ఏండ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరితే.. వారిద్దరూ పై అధికారుల ఆదేశాలను అనుసరించారని, అందువల్ల వారిని విడుదల చేయాలని డిఫెన్స్ లాయర్లు వాదించారు.