
అతడి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పుట్టినప్పటి నుంచే రెండు కాళ్లు పని చేయకున్నా.. వైకల్యాన్ని జయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కుటుంబాన్ని పోషించుకోవాలనే తపన ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దానికి తోడు ‘పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు’ అండగా నిలిచింది. అందుకే కాళ్లు లేకపోయినా గుండెధైర్యంతో ముందుకెళ్తున్నాడు తిరుపతి.
మహాముత్తారం, వెలుగు: కొడారి తిరుపతిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం జీలపల్లి. పుట్టినప్పుడు పోలియో వచ్చి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. పేద కుటుంబంలో పుట్టిన తిరుపతిని తల్లిదండ్రులు రామయ్య, మల్లక్క ఎంతో కష్టపడి పెంచి పెద్దచేశారు. పెండ్లి కూడా చేశారు. తిరుపతి, రజిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. రజిత కూలీ పనికి వెళ్లేది. బీసీ కార్పొరేషన్ ఇచ్చిన లోన్‌తో తిరుపతి చిన్న కిరాణ కొట్టు ఒకటి పెట్టుకుని నడిపేవాడు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఊళ్లో చాలా కిరాణ దుకాణాలు వెలిశాయి. గిరాకీ తగ్గింది. కుటుంబం గడవడం కష్టమైపోయింది. అప్పుడే తిరుపతికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఇప్పుడు తన కుటుంబాన్ని నిలబెట్టింది. అదేంటంటే.. భార్యను కిరాణం దుకాణంలో ఉంచి తాను కూరగాయలు అమ్మాలనుకున్నాడు. రెండు కాళ్లు పని చేయకున్నా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. తిరుపతికి ‘పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు’ అండగా నిలిచింది. ఆ ట్రస్టు ద్వారా ఎనభై వేల రూపాయల విలువైన మూడు చక్రాల స్కూటీని ఉచితంగా ఇచ్చారు. వ్యాపారం చేసుకోవడానికి కొంత డబ్బు కూడా సాయం చేశారు. దాంతో తిరుపతి ఆ స్కూటర్‌పై కూరగాయలు తెచ్చుకుని ఊరూరు తిరిగి అమ్ముతున్నాడు.
తెల్లవారకముందే..
‘తిరుపతి ప్రతిరోజూ తెల్లవారక ముందే స్కూటర్‌పై జీలపల్లి నుంచి కాటారం వెళ్లి మార్కెట్లో కూరగాయలు కొంటాడు. వాటిని లింగాపూర్, పర్లపల్లి, మాదారం, కొర్లకుంట, జీలపల్లి గ్రామాల్లో ఉదయం, సాయంత్రం టైంలో వాడవాడలా తిరిగి అమ్ముతాడు. రోజుకు సుమారు మూడు వేల రూపాయల కూరగాయలు అమ్ముడుపోతాయి. అన్ని ఖర్చులు పోను రోజుకు 500 రూపాయలు మిగులుతున్నాయి అని చెప్పాడు తిరుపతి.
ట్రస్టు సాయంతోనే..
పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు సాయంతోనే ఈ రోజు స్కూటీపై కూరగాయలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న. నాకు స్కూటీ కావాలని అడగడంతోనే ఇప్పించాడు మధన్న. దానివల్లే రోజుకు 500 రూపాయలు సంపాదిస్తున్న. ఆయన మేలు జన్మలో మర్చిపోను’ అంటున్నాడు తిరుపతి.
