పోలీసుల విచారణలో నోరు విప్పిన పుట్టా మధు

పోలీసుల విచారణలో నోరు విప్పిన పుట్టా మధు

మంథని లాయర్ దంపతుల హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్టా మధు ఎట్టకేలకు నోరు విప్పాడు. గత 10 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశాడు, ఎవరెవరిని కలిశాడు అనే వాటన్నింటికి సమాధానం చెప్పాడు. వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టా మధును విచారించాలని వామన్ రావు తండ్రి కిషన్ రావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు మధును విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అందులో భాగంగా పోలీస్ గెస్ట్‌హౌజ్‌లో విచారణకు వచ్చిన మధు.. అక్కడి నుంచి గన్‌మెన్లు, డ్రైవర్‌కు చెప్పకుండా తప్పించుకున్నాడు.

అక్కడి నుంచి వెళ్లిన ఆయన డైరెక్ట్‌గా మహారాష్ట్రకు చేరుకున్నాడు. అక్కడ రెండు రోజులు ఉన్న ఆయన ఆ తర్వాత చత్తీస్‌ఘర్‌లోని తన కూతురు వద్దకు చేరుకున్నాడు. అక్కడ మరో రెండు రోజులు ఉన్న తర్వాత ఒడిశా మీదుగా ఏపీ చేరుకున్నాడు. ఏపీ చేరుకున్న మధు.. భీమవరంలోని చేపల చెరువు దగ్గర మకాం వేశాడు. తనను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే పారిపోయానని మధు పోలీసుల విచారణలో చెప్పాడు.