నేను బతికుండాలని కోరుకోండి..వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుతా

నేను బతికుండాలని కోరుకోండి..వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుతా
  • అధికారుల ఇండ్లలో పనికి పెట్టడం మానవ హక్కుల ఉల్లంఘనే
  • సమ్మె చేయని ప్రభుత్వ శాఖ లేదు
  • శాసనసభలో వీఆర్ఏ ల సమస్యల గురించి మాట్లాడుతా
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కరీంనగర్: రాష్ట్రంలో సమ్మె చేయని ప్రభుత్వ శాఖ లేదని.. అన్ని శాఖల్లో ఇబ్బందులే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు 5 రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న ధర్నా,  నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 
వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. వీఆర్ఏలు వెట్టి చాకిరీ చేస్తున్నారని.. వీఆర్ఏ లను అధికారుల ఇండ్లలో పనిలో పెట్టడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏ వ్యవస్థ గురించి ప్రభుత్వం పట్టించకోకపోవడం బాధాకరం అన్నారు. 
‘నేను బతికుండాలని కోరుకోండి...వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అవుతా... వచ్చే ఎన్నికల వరకు నేను బ్రతికుంటే వీఆర్ఏ సమస్యలు పరిష్కరిస్తాం.. శాసనసభలో వీఆర్ఏ ల సమస్యల గురించి మాట్లాడుతా..వచ్చేది మా ప్రభుత్వమే.జ ముఖ్యమంత్రి ఎవరైనా మా ప్రభుత్వం వచ్చాక వీఆర్ఏ ల సమస్యలు పరిష్కరిస్తాం..’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పిచాలని, పే స్కేలు జీవోను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు వైద్య సదుపాయం ఇవ్వపోవడం బాధాకరం అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.