పీవీ సింధు గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలు

పీవీ సింధు గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలు

భారత ఏస్ షట్లర్ పీవీ సింధు మరోసారి తన సత్తా చాటింది. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ సాధించిన సింధు.. టోక్యోలోనూ బ్రాంజ్ మెడల్‌తో తన ప్రతిభను నిరూపించుకుంది. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌ను తన జీవితంగా ఎప్పుడూ ప్రాక్టీస్, గేమ్స్, టూర్స్‌ అంటూ బిజీగా ఉండే సింధు లైఫ్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. 

ఇద్దరు అథ్లెట్ల ముద్దుల కూతురు
తెలుగు తేజం పీవీ సింధు తల్లిదండ్రులు ఇద్దరూ అథ్లెట్లే కావడం గమనార్హం. తండ్రి పీవీ రమణ, తల్లి పి.విజయలు నేషనల్ లెవల్‌లో వాలీబాల్‌లో సత్తా చాటారు. కాబట్టి అథ్లెట్లకు పుట్టిన సింధు క్రీడా రంగాన్ని కెరీర్‌గా మలచుకోవడంలో పెద్ద విశేషం లేదనే చెప్పాలి. అయితే తమ కంటే సింధు దేశానికి మరిన్ని పతకాలు, ప్రతిష్ట తీసుకురావాలని ఆమెను ఓ చాంపియన్‌లా తీర్చిదిద్దడానికి పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. సింధు తండ్రి రమణ వాలీబాల్‌కు అందించిన సేవలకు గానూ 2000వ సంవత్సరంలో ప్రతిష్టాత్మక అర్జున అవార్డును కైవసం చేసుకోవడం గమనార్హం.  

ట్రైనింగ్ కోసం రోజూ 120 కి.మీ.ల ప్రయాణం
చిన్నతనంలోనే సింధుకు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెరిగింది. కూతురి ఇంట్రెస్ట్‌ను గమనించిన ఆమె పేరెంట్స్.. సింధు కోసం తీవ్రంగా కష్టపడ్డారు. బ్యాడ్మింటన్ ట్రెయినింగ్ కోసం సింధు రోజూ ఉదయం 3 గంటలకే నిద్రలేవాల్సి వచ్చేది. ఇంటి నుంచి పుల్లెల గోపీచంద్ అకాడమీకి వెళ్లి రావడానికి సింధు, ఆమె తండ్రి 60 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. అలా రోజూ రెండుసార్లు వెళ్లాల్సి వచ్చేది. అంటే రోజుకు 120 కి.మీ.లు సింధు తండ్రి రమణ ప్రయాణించేవారు. దాదాపు 12 సంవత్సరాలు ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఎదదగడం వెనుక రమణ, విజయల త్యాగాలు ఎన్నో ఉన్నాయి. 

ఆట కోసం అక్క పెళ్లి మిస్
పీవీ సింధు సోదరి దివ్య  2012లో మ్యారేజ్ చేసుకుంది. హైదరాబాద్‌లోనే ఆమె వివాహం జరిగినా.. ఆ వేడుకకు సింధు హాజరు కాలేదు. సోదరి పెళ్లి టైమ్‌లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నమెంట్‌లో పాల్గొనడం కోసం సింధు లక్నోకు వెళ్లింది. దీన్ని బట్టి ఆటపై సింధుకు ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో సింధు కెరీర్‌కు ఆమె పేరెంట్స్, ఫ్యామిలీ ఎంతగా విలువ, ప్రోత్సాహం అందించారో కూడా తెలుసుకోవచ్చు.

ఫోన్ లేకుండా మూడ్నెళ్లు గడిపింది
ఈ కాలంలో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం లేకుండా ఉండలేని పరిస్థితి. కానీ దేశం కోసం ఆడే క్రీడాకారులు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్‌ను వాడకపోవడం కూడా వారికి పెద్ద విషయం కాదేమో అనిపిస్తుంది. అందుకు సింధును ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ నెగ్గిన సింధు.. ఆ ఒలింపిక్స్‌కు సన్నాహకాల సమయంలో కోచ్ పుల్లెల్ గోపీచంద్ సలహా మేరకు ఓ నిర్ణయం తీసుకుంది. ట్రెయినింగ్ మీద మరింత ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో సింధు మూడు నెలలు తన ఫోన్‌ను పక్కనపెట్టింది. 

ఒక్క మెడల్.. నజరానాలెన్నో!
2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో వెండి పతకం నెగ్గడంతో ఒక్కసారిగా దేశం మొత్తం సింధు పేరు మార్మోగిపోయింది. సింధుకు పలు అవార్డులు, రివార్డులతోపాటు  నజరానాలు కూడా అందాయి. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సింధుకు బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా అందించాడు. ఈ బహుమతి తన జీవితంలో మర్చిపోలేనిదని సింధు చెబుతూ ఉంటుంది. 

ఈత, ధ్యానం.. ఆమె సీక్రెట్స్ ఇవే!
బ్యాడ్మింటన్‌ చాలా ఉత్కంఠతో కూడిన గేమ్. క్షణాల్లో ఆధిక్యం మారి ఆట స్వరూపమే మారిపోతుంది. ఒక్క చెత్త షాట్, ఒత్తిడిలో చేసే చిన్న తప్పుకు కూడా మ్యాచ్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఎంత ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్నా బ్యాడ్మింటన్ ప్లేయర్‌కు మెంటల్ ఫిట్‌నెస్ కూడా అంతే అవసరం. అందుకే స్విమ్మింగ్, మెడిటేషన్‌కు సింధు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఈత కొడుతూ, ధ్యానం చేస్తూ తనను తాను రీచార్జ్ చేసుకుంటుంది. యోగా కూడా ఆమె డైలీ ఫిట్‌నెస్‌లో భాగంగా మారింది. 

ఆ చిన్నారితో ఆడటం సవాల్!
బ్యాడ్మింటన్ కోర్టులో ప్రపంచ ఖ్యాతి పొందిన దిగ్గజ ప్లేయర్లను కూడా మట్టికరిపించే సింధుకు ఓ ఆటగాడ్ని చూస్తే మాత్రం భయం వేస్తుంటట. అదేంటి.. సింధుకు భయమా అని అనుకోకండి. సింధు తన మేనల్లుడు ఆర్యన్ గురించి ఓ సారి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. చిన్నారి ఆర్యన్ తనకు పెద్ద సపోర్టర్ అని.. అదే టైమ్‌లో సవాల్ విసిరే గట్టి ప్రత్యర్థి అంటూ సదరాగా కామెంట్ చేసింది. 

భోజన ప్రియురాలు.. పెద్ద ఫుడీ
ఆట కోసం ప్రాణం పెట్టే సింధు.. ఫిట్‌నెస్ కోసం స్ట్రిక్ట్‌గా డైట్‌ పాటిస్తుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే సింధు పెద్ద ఫుడ్డీ. ఆమె మంచి భోజన ప్రియురాలు. గేమ్‌ నుంచి విరామం తీసుకున్నప్పుడు తన ఫ్రెండ్స్, వేరే ప్లేయర్లు, కుటుంబ సభ్యులతో కలసి మంచి ఫుడ్ లాగిస్తుంది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తియ్యటి పెరుగు, ఐస్‌క్రీమ్ అంటే సింధుకు చాలా ఇష్టమని పుల్లెల గోపీచంద్ ఓ సందర్భంలో చెప్పారు.