పీవీ సింధుకు అరుదైన గౌరవం.. ఫ్లాగ్ బేరర్గా అవకాశం

 పీవీ సింధుకు అరుదైన గౌరవం.. ఫ్లాగ్ బేరర్గా అవకాశం

బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ ఇంగ్లండ్ లోని బర్మింగ్ హాం వేదికగా రేపటి (జులై 28) నుంచి  ప్రారంభం కానున్నాయి. ఈ విశిష్ట ప్రారంభోత్సవ వేడుకలో భారత జాతీయ పతాకాన్ని చేతపట్టి ముందు వరుసలో నడిచే గొప్ప అవకాశాన్ని  సింధు దక్కించుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనే భారత జట్టు తరఫున ఫ్లాగ్ బేరర్ గా సింధు వ్యవహరించనున్నారు. ఈవిషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ బుధవారం ప్రకటించింది. గాయం కారణంగా భారత ఫ్లాగ్ బేరర్ నీరజ్‌ చోప్రా ఈ ఈవెంట్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో ప్రారంభోత్సవంలో బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధును టీమిండియా ఫ్లాగ్‌ బేరర్‌గా ఎంపిక చేశారు.  

రెండుసార్లు ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన‌ సింధుకు..  గతంలో పలు సందర్భాల్లో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని టీమిండియాను లీడ్‌ చేసిన అనుభవం ఉంది. భారత్‌ బంగారు పతకాలు సాధించే అవకాశం ఉన్న విభాగాల్లో మహిళల బ్యాడ్మింటన్‌ కూడా ఒకటి.  ఇటీవల సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి జోరు మీదున్న సింధు ఈసారి తప్పక గోల్డ్‌ సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. సింధు గత కామన్వెల్త్‌ గేమ్స్‌ సింగిల్స్‌లో సిల్వర్‌ మెడల్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్ సాధించారు. 72 దేశాల నుంచి 5 వేలకుపైగా అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 12 రోజుల పాటు (జులై 28 నుంచి- ఆగస్టు 8 వరకు) 20 క్రీడా విభాగాల్లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. మొత్తం 16 విభాగాల్లో 214 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.  ఈ వేడుకలు భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 11.30 గంటలకు మొదలవుతాయి.