
- న్యాయం చేయాలని డిమాండ్
బషీర్ బాగ్, వెలుగు: హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ముందు స్వప్న లోక్ కాంప్లెక్స్ క్యూనెట్ బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. రెండు నెలలు గడుస్తున్నా తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ లాభాలు వస్తాయని ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు కట్టించుకొని మోసం చేశారని కన్నీరు పెట్టుకున్నారు. క్యూనెట్ ఆస్తులు రూ.137 కోట్లు ఫ్రీజ్ చేశామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారని, కానీ మోసం చేసిన వారికి బైయిల్ రావడంతో వారు మళ్లీ ఇదే తరహా మోసాన్ని కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు.
స్వప్న లోక్ కాంప్లెక్స్ ప్రమాదంలో చనిపోయిన తమ స్నేహితులు ఆరుగురికి నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు. క్యూనెట్ వారి మాటలు నమ్మి తమకు పరిచయం ఉన్న వాళ్లను ఈ స్కీమ్‌లో చేర్పించామని, అప్పు తెచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేశామన్నారు. బాధితులకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు డా దిడ్డి సుధాకర్ మద్దతు తెలిపారు. క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు. బాధితులకు న్యాయం చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు హామీ ఇవ్వడంతో వారు వెళ్లిపోయారు.