ఈ మహారాణి  పాలనకు ప్లాటినం జూబ్లీ

ఈ మహారాణి  పాలనకు ప్లాటినం జూబ్లీ

బ్రిటన్​ మహారాణి క్వీన్​ ఎలిజబెత్–2 ఈమధ్యే ప్లాటినం జూబ్లీ చేసుకుంది. ఎందుకంటే ఎక్కువ కాలం పాలించినందుకు. జూన్​ 2, 1953లో బ్రిటన్​ రాజవంశపు కిరీటాన్ని ఆమె​ అందుకుని..70 ఏండ్లుగా పాలన  కొనసాగిస్తోంది. ఇన్నేండ్లు పాలించిన రాచరికపు మహిళా రాణుల్లో క్వీన్​ ఎలిజబెత్​దే ఫస్ట్​ ప్లేస్​. ఇదొక్కటే కాదు, ఆమె ప్రత్యేకతలు మరెన్నో ఉన్నాయి.  

యునైటెడ్​ కింగ్​డమ్​(యుకె)లోని లండన్​లో ఏప్రిల్​ 21, 1926లో ఎలిజబెత్​ పుట్టింది. తల్లిదండ్రులు ఆల్బర్ట్​ ఫ్రెడ్రిక్ ఆర్థర్​ జార్జ్​(కింగ్​ జార్జ్​‌‌‌‌–6), ఎలిజబెత్​ బౌసీ‌‌‌‌–లియాన్​. ఎలిజబెత్​కు ఒక చెల్లెలు మార్గరెట్​. ​రాజకుటుంబం కావడంతో చిన్నప్పుడు అందరు పిల్లల్లాగా ఎలిజబెత్​ స్కూలుకు వెళ్లలేకపోయింది. చెల్లెలితో కలసి ఇంట్లోనే చదువుకుంది. వీళ్ళకు హెన్రీ మార్టిన్​ అనే టీచర్​ పాఠాలు చెప్పాడు. అలాగే మత విషయాల గురించి పాఠాలు క్వాంటర్​బరీ ఆర్చ్​ బిషప్​ చెప్పాడు. అమ్మమ్మ మేరియన్​ క్రాఫర్డ్​ కూడా ​మనవరాళ్ళకు చదువులో సాయపడింది.​ మేరియన్​ రాసిన ‘ది లిటిల్​ ప్రిన్సెస్​’ పుస్తకంలో ఎలిజబెత్​, మార్గరెట్​తో ఆమె అనుబంధం గురించి ఉంది. చదువులోనే కాదు ఆటపాటల్లోనూ ఎలిజబెత్​కు చెల్లెలు ​తోడుండేది. ఎలిజబెత్​ నిక్​నేమ్​ ‘లిలిబెట్​’. ఆ పేరు పెట్టింది చెల్లెలే. అక్క పేరును పలకలేక ‘లిలిబెట్​’ అని పిలిచేదట మార్గరెట్​. అది కాస్తా నిక్​నేమ్​లా మారింది. ఇదే పేరును​​ అమ్మమ్మకు గుర్తుగా మనవడు ప్రిన్స్​ హ్యారీ, మేఘన్​ దంపతులు తమ కూతురికి పెట్టారు. పెండ్లి అయ్యాక ఎలిజబెత్​ను భర్త ఫిలిప్​ ముద్దుగా ‘క్యాబేజీ’ అని పిలిచేవాడు.  

యుద్ధం.. ప్రేమ.. పెండ్లి..

సైన్యంలో చేరాలనే కోరిక చిన్నప్పుడు ఎలిజబెత్​కు బాగా ఉండేది. అందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. దాంతో తల్లి సాయంతో బ్రిటన్​ గర్ల్స్ స్కౌట్స్​లో, సీ రేంజర్స్​లో చేరింది. సెయిలింగ్​లో ట్రైనింగ్​ తీసుకుంది. ​ఆ తర్వాత 18 ఏండ్ల వయసులో బ్రిటన్​ సైనిక విభాగమైన ‘ఉమెన్స్​ ఆక్సిలరీ టెరిటోరియల్​ సర్వీస్’​లో​ జాయిన్​ అయింది. అక్కడే ట్రైనింగ్​ తర్వాత డ్రైవర్​గా, మెకానిక్​గా పనిచేసింది. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు తన వంతు సాయం చేసింది. సాయుధ బలగాల విభాగంలో పనిచేసిన బ్రిటన్​ రాజకుటుంబ మహిళగా గుర్తింపు పొందింది. యుద్ధం ముగిశాక లండన్​ వీధుల్లో నిర్వహించిన గెలుపు ర్యాలీలో చెల్లెలితో కలిసి పాల్గొంది. 

ఎలిజబెత్​ది ప్రేమ పెండ్లి. 13 ఏండ్ల వయసులో మొదటిసారి గ్రీస్​ ప్రిన్స్​ ఫిలిప్​ను ఓ వేడుకలో చూసింది. మొదటి చూపులోనే ఇష్టపడింది. ఆ తర్వాత ఇద్దరూ అప్పుడప్పుడూ ఉత్తరాలు రాసుకునేవారు. క్రమంగా వాళ్ల మధ్య ప్రేమ పుట్టింది. అయితే, వీళ్ల పెండ్లికి ఎలిజబెత్​ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కారణం, అప్పటికి ఫిలిప్​ కుటుంబం రాజరికం పోగొట్టుకుని, పేదరికంలో ఉంది. దాంతో ఆ కుటుంబాన్ని గ్రీస్​ నుంచి వెలివేశారు కూడా. ఇదొక్కటే కాకుండా ఫిలిప్​కు తోడబుట్టిన వాళ్లకు నాజీలతో సంబంధాలు ఉండేవి. ఫిలిప్​ కూడా జర్మనీ వ్యక్తిలా కనిపించేవాడు. దీంతో ఎలిజబెత్​ కుటుంబం పెండ్లికి మొదట ఇష్టపడలేదు. అయితే, ఫిలిప్​.. బ్రిటన్​ నేవీలో పనిచేయడం, రాజకుటుంబానికి నమ్మకంగా ఉండడంతో ఎలిజబెత్​తో పెండ్లికి ఒప్పుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక నవంబర్​,1947లో ఫిలిప్​తో ఎలిజబెత్​ పెండ్లి ఘనంగా జరిగింది. ఈ పెండ్లిని రేడియోలో ప్రసారం చేశారు.​ పెండ్లిలో ఎలిజబెత్​ వేసుకున్న డ్రెస్​కు ఒక ప్రత్యేకత ఉంది. సైన్యంలో పనిచేసినప్పుడు ఆమెకు వచ్చిన కూపన్స్​ను అమ్మి ఈ డ్రెస్​ తీసుకుంది. డ్రెస్​ కోసం దేశం నలుమూలల నుంచి మహిళలు తమ దగ్గర ఉన్న కూపన్స్​ను ఎలిజబెత్​కు పంపారు.  పెండ్లి తర్వాత నేవీ ఆఫీసర్​ ఫిలిప్​ భార్యగా ఎలిజబెత్​ మారింది. మధ్యధరాసముద్రం దగ్గరలోని మాల్టాలో ఫిలిప్​తో కలసి ఉండేది. వీళ్ళకు నలుగురు పిల్లలు చార్లెస్​, ఆన్నే, ఆండ్రూ, ఎడ్వర్డ్​.   

నో డ్రైవింగ్​ లైసెన్స్​.. నో పాస్​పోర్ట్​..

క్వీన్​ ఎలిజబెత్​–2కు కొన్ని ప్రత్యేక అధికారాలు, సౌకర్యాలు ఉన్నాయి. రాజకుటుంబం ఎలాంటి దుస్తులు వేసుకోవాలో రాణి నిర్ణయిస్తుంది. అలాగే రాణిని కలిసినా లేదా ఆమె ఎక్కడ కనిపించినా ఆడవాళ్లు నమస్కారం చేయాలి. మగవాళ్లు కొద్దిగా తలను కిందకు వంచి ‘బౌ’ చేయాలి. రాణి కుటుంబంలోని వాళ్లకీ ఇది వర్తిస్తుంది. 

మొదట ఎలిజబెత్​ ఇంటిపేరు విండ్సర్​. పెండ్లి అయ్యాక ‘మౌంట్​బాటన్’​. కిరీటం ధరించాక ఆమె ఈ రెండు పేర్లను వదులుకుని, తన పేరు చివర ‘రెజీనా’ అనే లాటిన్​ పదం చేర్చుకుంది. దీనికి ​రాణి అని అర్థం. అందుకే రాణి సంతకం ‘ఎలిజబెత్​ ఆర్.’ అని చేస్తుంది. ఆమెకి డ్రైవింగ్​ లైసెన్స్, పాస్​పోర్ట్​ లేకపోయినా దేశంలో ఎక్కడైనా వెహికల్​ నడిపించొచ్చు. విదేశాల్లోనూ డ్రైవ్​ చేయొచ్చు. బ్రిటన్​లో ఇలాంటి అవకాశం ఒక్క రాణికి మాత్రమే ఉంటుంది. ఆమె ప్రయాణించే వెహికల్​కు నెంబర్​ ప్లేట్​, స్పీడ్ లిమిట్​ ఉండదు.​ ‘బెంట్లీ స్టేట్​ లిమైసిన్’ అనే స్పెషల్​ వెహికల్ మాత్రమే వాడుతుందామె.  

ట్యాక్స్​ ఎగ్గొట్టొచ్చు

బ్రిటన్​ రాజ్యాంగం ప్రకారం రాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ నేరంలోనూ అరెస్టు చేయలేరు. రాణిగా ఆమెకు ఉన్న ప్రత్యేక హక్కు ఇది. అలాగే బ్రిటన్​ రాజకీయాల్లో రాణి బహిరంగంగా జోక్యం చేసుకోదు. కానీ, బ్రిటీష్​​ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి అధిపతి ఆమే. అందుకే,​ ప్రధానిని తొలగించే హక్కు కూడా రాణికి ఉంటుంది. క్వీన్​ ఎలిజబెత్​–2 కు ఉన్న మరో ప్రత్యేక హక్కు.. ట్యాక్స్​లు కట్టకపోవడం. మహారాణిగా ఆమెకు ఆ హక్కుని చట్టం కల్పించింది. అయితే, ఈ చట్టాన్ని ఆమె వాడుకోవడం లేదు. ప్రతి సంవత్సరం అందరిలాగే ట్యాక్స్​లు కడుతోంది. రాజకుటుంబ ఆస్తిపాస్తుల వివరాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి  బ్రిటన్​లో ఫ్రీడమ్ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ యాక్ట్​ కింద ఎవరైనా సరే ఇతరుల ఆర్థిక వ్యవహారాలు తెలుసుకోవచ్చు. అయితే, ఈ చట్టం​ నుంచి రాజకుటుంబానికి మినహాయింపు ఉంది. కానీ, క్వీన్​ ఎలిజబెత్​–2 మాత్రం ప్రతి సంవత్సరం తమ కుటుంబం చేస్తున్న ఖర్చు తాలూకు వివరాలను ప్రజలకు చెప్తోంది. రాజకుటుంబంలో పెళ్ళిళ్ళకు రాణి ఆమోదం ఉండాల్సిందే. ముఖ్యంగా కిరీటం కోసం పోటీలో ఉన్న మొదటి ఆరుగురి పెండ్లి రాణి అనుమతితోనే జరగాలి. లేకపోతే వాళ్లకి రాజు లేదా రాణి అయ్యే అర్హత ఉండదు. అలాగే బ్రిటన్​ రాజరిక చట్టం ప్రకారం మనవళ్లు, మనవరాళ్ల సంరక్షణను రాణి తీసుకోవచ్చు. అందుకు ఆ పిల్లల తల్లిదండ్రులు అడ్డు చెప్పడానికి వీల్లేదు. ఈ చట్టం కింగ్​ జార్జ్​–1 రాజుగా ఉన్నప్పుడు చేశాడు. అలాగే, బ్రిటన్​లోని కొలనులు, చెరువులు, నదుల్లో స్వేచ్ఛగా తిరిగే హంసలన్నీ అధికారికంగా రాణికే చెందుతాయి. ఈ చట్టాన్ని12వ శతాబ్దంలో చేశారు.

సొంత ఏటీఎం.. సొంత మనీ

బకింగ్​హామ్​ ప్యాలెస్ ​మొదటి అంతస్తులో రాణి కోసమే స్పెషల్​గా ఏటీఏం ఉంది. దీన్ని బ్రిటిష్​ బ్యాంక్​ ఏర్పాటుచేసింది. రాణికి సొంత కరెన్సీ కూడా ఉంది. ‘మౌండీ థర్స్​డే’ అనే కార్యక్రమంలో తనను కలిసిన వృద్ధులకు రాణి కొన్ని కాయిన్​లను ఇస్తుంది. వీటిని ‘మౌండీ మనీ’ అంటారు. వెండితో తయారుచేసిన ఈ నాణేలపై రాణి బొమ్మ ఉంటుంది. అలాగే సుమారు 35 దేశాల్లోని కరెన్సీ నోట్స్​, కాయిన్స్​ మీద బ్రిటన్​ రాణి బొమ్మ ఉంటుంది. ఇది గిన్నిస్​ రికార్డుల్లోనూ నమోదైంది. 

రెండు బర్త్​డేలు.. హత్యాయత్నాలు

ప్రతి సంవత్సరం​ రాణి రెండు బర్త్​డేలు జరుపుకుంటుంది. మొదటిది ఆమె పుట్టినరోజైన ఏప్రిల్​ 21న కుటుంబసభ్యుల మధ్య చేసుకుంటుంది. రెండోది ఆమె అధికారికంగా రాణి అయినందుకు గుర్తుగా ప్రతి ఏటా జూన్​ రెండో శనివారం జరుపుకొంటుంది. ఆ రోజు ‘ట్రూపింగ్ ది కలర్’​ పేరుతో భారీ వేడుక జరుగుతుంది. కాగా, క్వీన్​పై రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. 1981లో ట్రూపింగ్​ కలర్​ ఈవెంట్​లో గుర్రంపై రాణి వస్తుండగా మార్కస్​ సార్జంట్​ అనే 17 ఏండ్ల కుర్రాడు తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే, ఆ తుపాకీలో గుండ్లు లేవు. అది సైనికుల శిక్షణ కోసం ఉపయోగించేది. అందువల్ల రాణికి ఎలాంటి గాయాలు కాలేదు. మార్కస్​ను పట్టుకొని ఐదేండ్ల శిక్ష విధించారు. ఆ తర్వాత ఏడాది బకింగ్​హామ్​ ప్యాలెస్​లోని రాణి గదిలోకి మైఖేల్​ ఫేగన్​ అనే వ్యక్తి చొరబడ్డాడు. మైఖేల్​ను చూడగానే రాణి గట్టిగా అరుస్తూ గది నుంచి బయటకు పరిగెత్తింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి మైకేల్​ను అరెస్ట్​  చేశారు. కాగా, బ్రిటన్​ చట్టాల ప్రకారం నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కూడా రాణికి ఉంది.

రాణి వేడుకల్లో భారతీయ ఎంబ్రాయిడరీ 

బ్రిటన్​ రాణి క్వీన్​ ఎలిజబెత్​–2 ప్లాటినం వారోత్సవాల్లో భారతీయత తళుక్కుమంది. ఈ ఏడాది జూన్​ 17న ఇంగ్లండ్​లోని జరిగిన రాయల్ యాస్కాట్​లో జరిగిన లేడీస్​ డే వేడుకల్లో వేయి మంది మహిళలు చీరకట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీళ్ళలో భారతీయ మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో బెంగాల్​ ‘కాంత’ ఎంబ్రాయిడరీ చీర అందరినీ ఆకట్టుకుంది. మామూలుగా ఈ వేడుకలో సూట్స్​, హ్యాట్స్ ధరించిన మహిళలే ఎక్కువగా ఉంటారు. లండన్​లోనే డాక్టర్​గా పనిచేస్తున్న దీప్తిజైన్​ మనదేశ చేనేత గొప్పదనాన్ని రాణి ముందు చూపించాలనుకున్నారు.  తన చీర మీద లండన్​, కోల్​కతా నగరాల విశేషాలు, ఎలిజబెత్ రాణి ముఖం, బిగ్​బెన్​ గడియారం, లండన్​ టవర్​ను ఎంబ్రాయిడరీ చేయించారు. చీరకట్టులోని మహిళలు వేడుకలో బ్రిటన్​ రాణికి ఘనంగా స్వాగతం పలికారు. 

అనుకోకుండా దక్కిన కిరీటం
 

భర్త ఫిలిప్​తో కలసి 1952లో కెన్యా టూర్​కు వెళ్ళింది ఎలిజబెత్​. వాళ్లు అక్కడ ఉండగా, తండ్రి చనిపోయినట్లు ఎలిజబెత్​కు తెలిసింది. వెంటనే భర్తతో కలసి లండన్​ చేరుకుంది. రాజకుటుంబం రూల్స్​ ప్రకారం తండ్రి మరణించిన మరుక్షణమే ఎలిజబెత్​ రాణి అయింది. పాతికేండ్ల వయసులో బ్రిటన్​ రాణిగా బాధ్యతలు తీసుకుంది. కానీ, పాలనలో ఆమెకు ఏ అనుభవం లేదు. అయినా ధైర్యంగా ముందడుగు వేసింది. దేశాన్ని నడిపించింది. ప్రజల మెప్పు పొంది ఇప్పటికీ మహారాణిగా జేజేలు అందుకుంటోంది. ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించినప్పుడు దేశం నలుమూల నుంచి వచ్చిన వేలాది మంది జనమే దీనికి సాక్ష్యం. ఎక్కువ కాలం పాలించిన చక్రవర్తుల్లో లూయిస్​‌‌‌‌–14(ఫ్రాన్స్​) మొదటివాడు.ఈయన 72 ఏండ్ల 110 రోజులు పాలించాడు. మూడో స్థానంలో థాయ్​లాండ్​ చక్రవర్తి భూమిబల్య అతుల్యతేజ్​ ఉన్నాడు. ఈయన 70 ఏండ్ల 126 రోజులు పాలించాడు. ఈ ఏడాది జూన్​ 13తో అతుల్యతేజ్​ను క్వీన్​ ఎలిజబెత్​–2 దాటేసి రెండో స్థానంలోకి చేరింది. మరో రెండేండ్లు పదవిలో కొనసాగితే లూయి–14ను కూడా దాటేసి ఫస్ట్​ ప్లేస్​లో నిలుస్తారు.