ప్రధానిని ప్రశ్నించే సమయం కాదిది

ప్రధానిని ప్రశ్నించే సమయం కాదిది
  • రాహుల్​పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపాటు

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో ఇండియా–చైనాకు మధ్య జరిగిన ఘర్షణ విషయం మీద ప్రధాని మోడీని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. దేశం కోసం 20 మంది సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేసిన సమయంలో ప్రధానిని ప్రశ్నించడం ద్వారా రాహుల్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని పాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేదాకా అయినా రాహుల్ వేచి చూడాల్సిందన్నారు. చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి కాంగ్రెస్ మర్చిపోయి ఉంటుందని విమర్శించారు.

‘ఇలాంటి సమయాల్లో ఇండియా గవర్నమెంట్‌ను నమ్మకపోవడం రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యమేనని చెప్పాలి. మీరు (రాహుల్) ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారంటే.. అది ఓ వ్యక్తికి వ్యతిరేకమని కాదు, దేశ నాయకుడికి వ్యతిరేకంగా ఉందని గ్రహించాలి’ అని పాత్రా చెప్పారు.
ఇదే విషయంపై బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ కూడా స్పందించారు. ‘ప్రతిపక్షాల ప్రవర్తన చాలా దురదృష్టకరం. దేశం మొత్తం ఆర్మీతోపాటు కేంద్ర సర్కార్ వైపు నిలిచిన సమయాన.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఇండియా శత్రవులకు ప్రయోజనం చేకూరేలా కామెంట్లు చేయడం దురదృష్టకరం. చైనా తమ వాదనను చెప్పడానికి రాహుల్ స్టేట్‌మెంట్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది’ అని రామ్ మాధవ్ పేర్కొన్నారు.