బీఆర్​ఎస్​ ఖాళీ.. కాంగ్రెస్​, బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ

బీఆర్​ఎస్​ ఖాళీ.. కాంగ్రెస్​, బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ
  • పెద్దల తీరు మారడం లేదని కొందరు.. భవిష్యత్తు లేదని ఇంకొందరు..
  • లోక్​సభ ఎన్నికల నాటికి కారుకు చాలామంది కీలక నేతల గుడ్​బై!
  • వరుసబెట్టి సీఎం రేవంత్​ను కలిసి వస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు, ముఖ్యులు
  • పైకి అభివృద్ధి పనులకే అని చెప్తున్నా.. పార్టీ మారేందుకేనని టాక్​
  • కాంగ్రెస్​ కీలక నేత డీకే శివకుమార్​తో​ మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ
  • అల్లుడితో కలిసి కాంగ్రెస్​లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం
  • ఇప్పటికే బీజేపీలో చేరిన ఇద్దరు సిట్టింగ్​ ఎంపీలు, పలువురు మాజీ ఎంపీలు

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్​ఎస్​కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ కీలక లీడర్లు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ తమను పట్టించుకోలేదని కొందరు.. ప్రజాతీర్పును పార్టీ పెద్దలు గౌరవించడం లేదని ఇంకొందరు.. పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని మరికొందరు తమ దారి తాము చూసుకుంటున్నారు.

లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసపెట్టి గులాబీ ముఖ్యనేతలు కాంగ్రెస్​, బీజేపీలో చేరిపోతున్నారు. ఇప్పటికే పలువురు తమ అనుచరులతో కలిసి ఆయా పార్టీల్లో జాయిన్​ అయ్యారు. పైకి మాత్రం ‘‘అక్కడనో ఇక్కడనో తలమాసినోడు ఒకరిద్దరు పోతే పార్టీకి ఫరఖ్​ పడదు” అని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ అంటున్నా.. అంతర్గతంగా మాత్రం ఆ లీడర్లను పిలిపించుకొని ఆయన ఒకటికి రెండుసార్లు చెప్పిచూస్తున్నారు. బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా ఎవరూ వినడం లేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ విషయంలోనూ అదే జరిగింది.  


ఎంపీ టికెట్ ఇస్తామని, ప్రచారానికి కావాల్సినవన్నీ చూసుకుంటామని పార్టీ పెద్దలు పిలిచి చెప్తున్నా కీలక నేతలు బీఆర్​ఎస్​లో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు గులాబీ పార్టీకి గుడ్​బై చెప్పారు. ఇందులో ఇద్దరు ఎంపీలు బీజేపీలో.. ఒకరు కాంగ్రెస్​లో చేరిపోయారు. మొన్నటి వరకు బీఆర్​ఎస్​ ఎంపీ టికెట్​ ఆశించిన నేతలు కూడా ఇప్పుడు తమకు పార్టీ టికెట్​ వద్దని, పోటీలో నుంచి తప్పుకుంటున్నామని పార్టీ పెద్దలకు చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ గులాబీ పార్టీకి బలమైన అభ్యర్థులు దొరకడం లేదు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. ఆ అభ్యర్థుల్లో కూడా కొందరు పోటీ చేయడం డౌటేనని గులాబీ శ్రేణుల్లో చర్చ నడుస్తున్నది. 

కాంగ్రెస్​లో చేరేందుకు ఎమ్మెల్యేల ప్రయత్నాలు

కాంగ్రెస్​లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు పలువురు బీఆర్ఎస్‌‌  ఎమ్మెల్యేలు సంకేతాలు పంపుతున్నారు. తమ అనుచరుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్​ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. కొన్నిరోజుల నుంచి వరుసగా సీఎం రేవంత్​రెడ్డిని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కలిసి వస్తున్నారు. అభివృద్ధి పనుల కోసమే కలుస్తున్నామని బయటికి వాళ్లు చెప్తున్నప్పటికీ ప్రచారం మాత్రం పార్టీ మారేందుకేనని జరుగుతున్నది.

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్​ రెడ్డి(దుబ్బాక), సునీతా లక్ష్మారెడ్డి(నర్సాపూర్​), మహిపాల్​ రెడ్డి(పటాన్​చెరు), మాణిక్​ రావు(జహీరాబాద్) సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య  రెగ్యులర్​గా సెక్రటేరియెట్​లో మంత్రులను కలుస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో ఆయన సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు. ఈ మధ్యనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్​తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్  సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.

బీఎస్పీతో పొత్తును నిరసిస్తూ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్​లో చేరబోతున్నారనే టాక్  పొలిటికల్​ సర్కిల్స్​లో వినిపిస్తున్నది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పెద్దలతో మొదటి దఫా చర్చలు కూడా పూర్తయినట్లు  ప్రచారం సాగుతున్నది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి కొడుకు గుత్తా అమిత్​ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు టాక్​ నడుస్తున్నది.

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్‌‌పర్సన్‌‌ అనిత, వికారాబాద్​ జెడ్పీ చైర్​పర్సన్​ సునీతా మహేందర్​రెడ్డి బీఆర్​ఎస్​కు గుడ్​బై చెప్పి.. కాంగ్రెస్​లో చేరారు. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌‌, జీహెచ్‌‌ఎంసీ మాజీ మేయర్‌‌ బొంతు రామ్మోహన్‌‌ కూడా ఈ మధ్యే కాంగ్రెస్​లో చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా కాంగ్రెస్​ కీలక నేత డీకే శివకుమార్​ను బెంగళూరులో కలవడం చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా కాంగ్రెస్​లో చేరుతారన్న ప్రచారం జరుగుతున్నది. 

బీజేపీలో చేరి ఎంపీ టికెట్లు

బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీలు , మాజీ ఎంపీలు బీజేపీ వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ఎంపీలు బీబీ పాటిల్​, రాములు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్​, గోడెం నగేశ్​ బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, శానంపూడి సైదిరెడ్డి కూడా కమలం పార్టీలో చేరారు. బీబీ పాటిల్​తోపాటు రాములు కొడుకు భరత్​కు, సీతారాం నాయక్​కు, గోడెం నగేశ్​కు, సైదిరెడ్డికి బీజేపీ ఎంపీ టికెట్లను ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ రేపో మాపో బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతున్నది. 

పైనోళ్ల తీరు మారలే..భవిష్యత్​ లేకపాయె

అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కూడా బీఆర్​ఎస్​ పార్టీ పెద్దల వ్యవహారశైలిలో ఏ మాత్రం మార్పు లేదని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు. కొందరు కీలక నేతలు పార్టీ వీడటానికి ఆ తీరే కారణమవుతున్నదని చెప్తున్నారు. ప్రజాతీర్పును కూడా పార్టీ పెద్దలు గౌరవించకుండా మాట్లాడు తున్నారని, ఇట్లయితే లోక్​సభ ఎన్నికల్లో కష్టమని లీడర్లు తమ దారి తాము చూసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్​లోకి 

బీజేపీ నుంచి కూడా పలువురు కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దంపతులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు చెప్పినట్లు తెలిసింది. బీజేపీ నుంచి చేవెళ్ల, మల్కాజ్​గిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు   వీరేందర్ గౌడ్  కూడా కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మహబూబ్​నగర్​ బీజేపీ ఎంపీ టికెట్​ను జితేందర్​ రెడ్డి ఆశించగా.. పార్టీ అధిష్టానం డీకే అరుణకు కేటాయించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. జితేందర్​రెడ్డిని సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​ రెడ్డి కలిశారు.