బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం నేతల క్యూ

బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం  నేతల క్యూ
  • కొత్తవారిపై హైకమాండ్ ఫోకస్ 
  • 28 న రాష్ట్రానికి అమిత్ షా
  • కొంగర కలాన్ లో ఎన్నికల సన్నాహక సమావేశం
  • 12 వందల మంది పాల్గొనే అవకాశం 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర బీజేపీలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీ టికెట్ల కోసం పార్టీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నలుగురు సిట్టింగ్ ఎంపీలుండగా..వచ్చే ఎన్నికల్లో  దాన్ని ఎలా  రెట్టింపు చేయాలనే దానిపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రం లోని17 ఎంపీ సీట్లల్లో  కనీసం 8  సీట్లకు తగ్గకుండా తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ వ్యూహాలకు పదును పెడుతున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 28 న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. పార్ల మెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం పేరిట హైదరాబాద్ లో మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి మండల బీజేపీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గ,  జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు మొత్తం 12 వందల మంది హాజరుకానున్నారు. సిటీ శివారు ప్రాంతం కొంగర్ కలాన్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీటింగ్ కొనసాగనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో  మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా అమిత్ షా.. పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఒక్కో సీటుకు కనీసం ముగ్గురు

బీజేపీ  ఎంపీ టికెట్ల కోసం నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో సీటుకు కనీసం మూడు నుంచి ఐదుగురు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో  8 సీట్లను సాధించడం, 7 శాతం ఉన్న ఓటింగ్ 14 శాతానికి పెరగటం, 19 చోట్ల రెండో స్థానంలో నిలవడం, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఓట్లను పొందడంతో పార్టీ కేడర్ లో, లీడర్లలో  కొత్త జోష్ వచ్చింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో  పోటీ చేయాలని ఎక్కువ మంది బీజేపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో  ప్రధాని మోదీ ప్రభావం కూడా ఉండనున్నందునా పలువురు నాయకులు ఎంపీ టికెట్ పై కన్నేశారు. 

జహీరాబాద్ కు బండి సంజయ్

 కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో  రెడ్డి సామాజిక వర్గం ఓట్లే అధికంగా ఉన్నాయి. అక్కడ వారి ఓట్లు లక్షా 25 వేల వరకు ఉన్నాయి. దాంతో ఈసారి ఇక్కడి నుంచి తమ వర్గం వారికే టికెట్ ఇవ్వాలని  రెడ్డిలు హైకమాండ్ వద్ద బలంగా వినిపిస్తున్నారు. బీజేపీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా  పని చేసిన గుజ్జుల రామకృష్ణా రెడ్డి ఇదే విషయాన్ని రాష్ట్ర, జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్ కి వ్యతిరేకంగా గుజ్జుల నాయకత్వంలో పలువురు సీనియర్లు కూడా ఇటీవల కరీంనగర్ లో సమావేశమయ్యారు.  ఇది సంజయ్ వర్గానికి మింగుడు పడడం లేదు. రెడ్డి వర్గానికి చెందిన ఒకరిద్దరు ఇక్కడ టికెట్ పై ఆశలు పెంచుకున్నారు. సంజయ్ ని జహీరాబాద్ నుంచి పోటీ చేయించనున్నారనే చర్చ కూడా సాగుతోంది. దీనిపై పార్టీలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు స్థానంలో ఇతరులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  అక్కడ రమేశ్ రాథోడ్, రాథోడ్ బాపూరావులు టికెట్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

 కొత్త వారికే  ప్రాధాన్యత ఎక్కువ!   

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  దాదాపు పాత నేతలంతా  ఓడిపోయారు. రాజాసింగ్ మినహా గెలిచినవారంతా  కొత్తవారే కావడంతో  పార్ల మెంట్ ఎన్నికల్లోనూ కొత్త వారికే  ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని  బీజేపీ హైకమాండ్  పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈటల, రఘునందన్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు  ఓడిపోవడంపై బీజేపీ జాతీయ నాయకత్వం లోతుగా విశ్లేషణ చేస్తోంది.  నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో  ఒకరిద్దరిని మార్చే అవకాశం ఉందని..లేదా  ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న చోటు నుంచి మరో చోటుకు మార్చే అవకాశం లేకపోలేదని రాష్ట్ర బీజేపీలో జోరుగా చర్చ సాగుతోంది. 

మెదక్ నుంచి రఘునందన్ లేదా ఈటల

వరంగల్ నుంచి ఎమ్మార్పీఎస్ జాతీయ​అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోటీ చేయించనున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే స్థానానికి రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ ఆసక్తి చూపిస్తున్నారు. భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యకే తిరిగి టికెట్ దక్కనుందనే ప్రచారం పార్టీలో ఉన్నా...ఇదే సీటును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ పోటీకి రెడీ అంటున్నారు. మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు ఈటల కూడా సై అంటున్నారు. హైదరాబాద్ నుంచి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కన్వీనర్  భగవంత రావు తిరిగి పోటీకి సిద్ధంగా ఉన్నారు.ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి తిరిగి పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు పార్టీలో చర్చ  సాగుతున్నది.