
2028 నాటికి రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా
ముంబై: నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేసే క్విక్ కామర్స్ రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆర్డర్ల విలువ రూ. 64 వేల కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024 ఆర్థిక సంవత్సరం)లో నమోదైన రూ. 30 వేల కోట్ల కంటే రెట్టింపు అని కేర్‌ఎడ్జ్ అడ్వైజరీ రిపోర్ట్ వెల్లడించింది.
దీని ప్రకారం.. ఈ వృద్ధి 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్డర్ల విలువ రూ. రెండు లక్షల కోట్లకు పైగా చేరుకోవచ్చు. ఇది ప్రస్తుత విలువ కంటే మూడు రెట్లు ఎక్కువ. బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వంటి ప్లాట్‌ఫారాల్లో స్థూల ఆర్డర్ విలువ బాగా పెరిగింది. డిజిటల్ పేమెంట్స్ పెరగడం, వినియోగదారులు భారీగా ఖర్చు పెట్టగలగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు.
2025 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాట్‌ఫారాలు ఫీజుల ద్వారా సుమారు రూ. 10,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 450 కోట్లతో పోలిస్తే భారీ పెరుగుదల. ఈ ఆదాయాలు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 34,500 కోట్లకు చేరుకుంటాయని అంచనా. కంపెనీలు ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచడం వల్ల అధిక ఆదాయం వచ్చింది. కేర్‌ఎడ్జ్ అడ్వైజరీ సీనియర్ డైరెక్టర్ హెడ్ తన్వి షా మాట్లాడుతూ మున్ముందు టైర్-2 టైర్-3 నగరాల్లోకి లోతుగా చొచ్చుకుపోవడం, టెక్నాలజీతో కూడిన ఇన్నోవేషన్లు భారతదేశపు క్విక్ కామర్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్తాయని అన్నారు.
లాభదాయకతపై దృష్టి
క్విక్ కామర్స్ కంపెనీలు ఇప్పుడు వేగవంతమైన విస్తరణ నుంచి లాభదాయకత, కార్యాచరణ సామర్థ్యంపై దృష్టి సారిస్తున్నాయి. ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్లు, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులు, టెక్నాలజీ ఆధారిత ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్ వంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో 7-9శాతం ఉన్న 'టేక్ రేట్' (ప్లాట్‌ఫారమ్‌లు లావాదేవీ విలువలో ఆదాయంగా ఉంచుకునే శాతం) 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 18శాతానికి పెరిగింది.
భారతదేశ మొత్తం కిరాణా మార్కెట్‌లో క్విక్ కామర్స్ వాటా ప్రస్తుతం ఒకశాతం మాత్రమే ఉన్నప్పటికీ, దీనికి అపారమైన వృద్ధి సామర్థ్యం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో డార్క్ స్టోర్‌లు లేదా మైక్రో- వేర్‌హౌస్‌ల సంఖ్య 70శాతం కంటే ఎక్కువ పెరిగి 3,072 కి చేరుకుంది. స్టోర్ సగటు ఆదాయం 25శాతం పెరిగింది. వినియోగదారులు సౌకర్యం, వేగం వైపు మళ్లుతున్నారు.
ఇది క్విక్ కామర్స్ వృద్ధికి దోహదపడుతుంది. భారతదేశంలో 27 కోట్ల మందికిపైగా ఆన్‌లైన్ షాపర్లు ఉన్నారు. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఇ-రిటైల్ యూజర్ బేస్. స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ సదుపాయం వేగంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ క్విక్ కామర్స్ రంగానికి మేలు చేస్తాయని కేర్‌ఎడ్జ్ రిపోర్ట్ పేర్కొంది.