తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మిర్చితో మలక్‌పేట్ వ్యవసాయ మార్కెట్ కళకళలాడుతోంది. మిర్చి వ్యాపారం చేసేందుకు వ్యాపారులు, రైతులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. ఈ ఏడాది మిర్చి పంట ధరలు 25 శాతం నుంచి 35 శాతం పెరగటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోయిన ఏడాది మిర్చి ధర క్వింటాల్ కు రూ.14 వేలు ఉండగా ప్రస్తుతం క్వింటాల్ కు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతోంది. అయితే, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మిర్చి పంటకు తెగుళ్లు రావడం, వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మలక్ పేట్ మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఎం. దామోదర్ అన్నాడు.
మహబూబ్ నగర్, గద్వాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, అలంపూర్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా నుంచి మలక్ పేట్ మార్కెట్ కు రోజుకు 9000 బస్తాల మిర్చి వస్తుంది. సూపర్ 10 రకానికి రూ.23 వేలు, బాడిగ రకానికి రూ.30 వేలు పలుకుతున్నాయి.
