సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ ఇండియాతో మ్యాచ్ అంటే ఎలా చెలరేడుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా కెరీర్ ప్రారంభం నుంచి టీమిండియాపై సెంచరీలతో చెలరేగుతూ వచ్చాడు. ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో 86 బంతుల్లో 106 పరుగులు చేసి పలు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఘనతలను ఈ ప్రొటీస్ వికెట్ కీపర్ అందుకున్నాడు.
వన్డేల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు:
వైజాగ్ లో సెంచరీతో డికాక్ ఒక ఆల్ టైమ్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాపై వన్డేల్లో 7 సెంచరీలు కొట్టిన డికాక్.. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా జయసూర్యతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇండియాపై డివిలియర్స్, రికీ పాంటింగ్, సంగక్కర వన్డేల్లో 6 సెంచరీలు కొట్టి రెండో స్థానంలో ఉన్నారు.
స్వదేశంలో కాకుండా వేరే దేశంలో అత్యధిక సెంచరీలు:
వన్డేల్లో ఇండియా గడ్డపై 7 సెంచరీలు చేసిన డికాక్..స్వదేశంలో కాకుండా వేరే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా సచిన్, సయీద్ అన్వర్, డివిలియర్స్, రోహిత్ శర్మల సరసన చేరాడు. సచిన్, అన్వర్ యూఏఈలో 7 సెంచరీలు కొడితే.. రోహిత్ శర్మ ఇంగ్లాండ్ లో.. డివిలియర్స్ ఇండియాలో ఈ ఘనత సాధించారు.
వికెట్ కీపర్ గా అత్యధిక సెంచరీలు:
వన్డేల్లో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా అత్యధిక సెంచరీలు (23) చేసిన ప్లేయర్ గా సంగక్కరతో కలిసి డికాక్ అగ్రస్థానంలో ఉన్నాడు. షాయ్ హోప్ (19), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (16), జోస్ బట్లర్ (11), ఎబి డివిలియర్స్ (10), ఎంఎస్ ధోని (10) వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు.
►ALSO READ | IND vs SA: ఇండియా అంటే చెలరేగుతాడు: డిసైడర్ మ్యాచ్‌లో సెంచరీతో దుమ్ములేపిన డికాక్
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్:
ఇండియాపై 7 సెంచరీలతో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా డికాక్ నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజం గిల్ క్రిస్ట్ శ్రీలంకపై ఆరు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇలా ఒక్క సెంచరీతో డికాక్ ఏకంగా నాలుగు రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి రెండు వన్డేల్లో విఫలమైన డికాక్ నిర్ణయాత్మక మూడో వన్డేలో చెలరేగాడు. ఆరంభంలోనే రికెల్ టన్ వికెట్ కోల్పోవడంతో జాగ్రత్తగా ఆడిన ఈ వికెట్ కీపర్.. ఆ తర్వాత క్రమంగా బ్యాట్ ఝుళిపించాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో వికెట్ కు కెప్టెన్ బవుమాతో కలిసి 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. హాఫ్ సెంచరీ తరువాత దూకుడు పెంచాడు. 30 ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్ లో సిక్సర్ కొట్టి 80 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ తర్వాత ప్రసిద్ కృష్ణ ఒక యార్కర్ తో డికాక్ ను ఔట్ చేసి భారత జట్టుకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఓవరాల్ గా 86 బంతుల్లో 106 పరుగులు చేసి ఔటయ్యాడు.
