మిథాలీ, అశ్విన్‌లకు రాజీవ్ ఖేల్ రత్న!

మిథాలీ, అశ్విన్‌లకు రాజీవ్ ఖేల్ రత్న!

భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్, టెస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు బీసీసీఐ నామినేట్ చేయనుంది. వీరితో పాటు అదనంగా సీనియర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాలను అర్జున అవార్డు కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే మహిళల నుంచి మాత్రం ఒక్కరు కూడా అర్జున అవార్డుకు నామినేట్ కాలేదు. 

అత్యంత విజయవంతమైన మహిళా క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న 38 ఏళ్ల మిథాలీ గత వారం అంతర్జాతీయ క్రికెట్‌లో 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆమె మహిళల వన్డేల్లో 7,170 పరుగులతో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేశారు. మిథాలీ రాజ్ 2003లో అర్జున అవార్డును మరియు 2015లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 

దాదాపు ఒక దశాబ్దం పాటు భారత టెస్ట్ జట్టులో అంతర్భాగంగా ఉన్నఅశ్విన్.. 400లకు పైగా వికెట్లు తీసిన వారిలో నాలుగవ భారతీయుడు. అదేవిధంగా టెస్టుల్లో అత్యధికంగా 4174 వికెట్లు సాధించిన నాలుగవ వ్యక్తి విశేషం. అశ్విన్ 2014లో అర్జున అవార్డును గెలుచుకున్నాడు.

క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు మే 20న ప్రకటించింది. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 21గా నిర్ణయించింది. కానీ, కరోనా కారణంగా ఆ గడువు జూన్ 28 వరకు పొడిగించబడింది. గతంలో దరఖాస్తు చేసుకోవాలంటే సిఫార్సులు తప్పనిసరిగా అవసరమయ్యేవి. అయితే కరోనా, లాక్‌డౌన్ దృష్ట్యా ఈ సిఫారసులను మాఫీ చేశారు.

గతేడాది 74 మంది ఆటగాళ్లకు అవార్డులు అందజేయగా.. వారిలో ఖేల్ రత్న అవార్డు అందుకున్న అయిదుగురిలో భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకరిగా నిలిచారు. అవార్డులు అందుకున్న వారికి ఇచ్చే ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు రూ .25 లక్షలు, అర్జున అవార్డు గ్రహీతలకు రూ .15 లక్షలు, ద్రోణాచార్య (జీవితకాలం) అవార్డు గ్రహీతలకు రూ .15 లక్షలు, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహితలకు రూ .10 లక్షలుగా ప్రైజ్ మనీ నిర్ణయించారు.