మనోహర్ సస్పెన్షన్ను ఎత్తివేయాలి: ఆర్.కృష్ణయ్య

మనోహర్ సస్పెన్షన్ను ఎత్తివేయాలి: ఆర్.కృష్ణయ్య

ఓయూ, వెలుగు: ఓయూ ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్​ మనోహర్‌‌ సస్పెన్షన్​ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఓయూ పరిపాలన భవనంలో రిజిస్టార్ ప్రొఫెసర్​ నరేశ్​రెడ్డిని కలిసి ఈ అంశంపై చర్చించారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్​రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు ప్రకటించినప్పటికీ, వాటికి అనుగుణంగా అధికారులు వ్యవహరించడం లేదని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, కక్షలతో వ్యవహరించడం తగదని, సస్పెన్షన్‌‌ను వెంటనే ఎత్తివేయాలని, లేదంటే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.