రాష్ట్ర సర్కార్ పై ఆర్.కృష్ణయ్య ఫైర్

రాష్ట్ర సర్కార్ పై ఆర్.కృష్ణయ్య ఫైర్

ముషీరాబాద్, వెలుగు: హాస్టల్ స్టూడెంట్లకు పూట భోజనానికి రూ.10 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని, అవి ఎలా సరిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ‘‘హోటల్ కు వెళ్తే రూ.100కు తక్కువకు భోజనం రావడం లేదు. అలాంటిది హాస్టల్ స్టూడెంట్లకు రూ.10కే భోజనం ఎలా వస్తుంది? వాళ్లకు నాసిరకం భోజనమే అందుతోంది. ఎదిగే పిల్లలకు నాసిరకం భోజనం పెడితే, జ్ఞాన సమాజం ఎలా ఏర్పడుతుంది” అని ఆయన అన్నారు. స్టూడెంట్లకు ఇచ్చే మెస్ చార్జీలు, స్కాలర్ షిప్​లు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులతో కలిసి హైదరాబాద్​ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, స్కాలర్​షిప్​లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్​ ధర్నా చౌక్​లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగాకృష్ణయ్య మాట్లాడారు. ‘‘రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లవుతున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రత్యేక రాష్ట్రంలోనూ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడం విడ్డూరం. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం నియమించినప్పటికీ కార్యాచరణ చేపట్టకపోవడం విచారకరం” అని అన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు.. డ్యూటీలు మరిచి, భూదందాలకు పాల్పడుతున్నారని కృష్ణయ్య ఆరోపించారు. అలాంటోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ‘‘మెస్ చార్జీలను రూ.3 వేలకు పెంచాలి. పాకెట్ మనీ కింద అబ్బాయిలకు రూ.500, బాలికలకు రూ.వెయ్యి ఇవ్వాలి. బీసీ స్టూడెంట్ల కోసం 300 కొత్త హాస్టళ్లు నిర్మించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

మీ జీతాలైతే పెంచుకుంటరా? 

హాస్టల్ స్టూడెంట్లకు నాణ్యమైన ఆహారం అందించాలని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులు హాస్టళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మూడు రెట్లు పెంచారు. ఉద్యోగుల జీతాలు రెండుసార్లు పెంచారు. కానీ విద్యార్థుల మెస్ చార్జీలు ఎందుకు పెంచడం లేదు?” అని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్​షిప్​లు, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్​మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్ చార్జీలు పెంచాలని ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఫైర్ అయ్యారు. బీసీలను చిన్నచూపు చూడడం సరికాదన్నారు. ధర్నాలో నేతలు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, ఎర్ర సత్యనారాయణ, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.