కొత్త జిల్లాల పోస్టులు భర్తీ చేయాలి..సీఎం రేవంత్రెడ్డికి ఆర్. కృష్ణయ్య లేఖ

కొత్త జిల్లాల పోస్టులు భర్తీ చేయాలి..సీఎం రేవంత్రెడ్డికి ఆర్. కృష్ణయ్య లేఖ

ముషీరాబాద్, వెలుగు: పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం అధికారులను కేటాయించడం మర్చిపోయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొత్త జిల్లాలకు వెంటనే అదనపు పోస్టులను మంజూరు చేసి, వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. కొత్త జిల్లాల్లో 2017లో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారని, కానీ, వీటికి అవసరమైన అదనపు పోస్టులను సృష్టించలేదని చెప్పారు.  ప్రస్తుత ఉద్యోగులతోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయని వెంటనే అదనపు పోస్టులను మంజూరు చేసి భర్తీ చేయాలని కోరారు. 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ  జిల్లాల్లో 40 శాఖల జిల్లా ఆఫీసులు,131 మండలాలు, 30 రెవెన్యూ డివిజన్లు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 డీఎస్పీ, 31 పోలీస్ సర్కిళ్లు,7 పోలీస్ కమిషనరేట్లు, 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. వీటికి అనుగుణంగా గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 4, సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున మంజూరు చేసి భర్తీ చేయాలని కోరారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను అధికారులు పూర్తిస్థాయిలో లెక్కించడం లేదని ఏదో నామమాత్రంగా లెక్కించి అధికారులు ప్రతిపాదనలు పంపారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని అదనపు పోస్టుల భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.