- సీఎంను కోరిన ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి బీసీ కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల రుణాలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య శనివారం కోరారు. బీసీ కులాల అభివృద్ధికి బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు.
గత 75 ఏండ్లుగా బీసీల జీవితాల్లో ఆశించిన స్థాయిలో గుణాత్మక మార్పులు రాలేదని, గత 13 ఏండ్ల పాలనలో ఏ ఒక్క బీసీకి సబ్సిడీ రుణాలు అందకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం 3.62 లక్షల దరఖాస్తులు స్వీకరించినా ఎవరికీ రుణాలు మంజూరు చేయలేదని, ప్రస్తుతం సుమారు 6.80 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
ఆధునిక కాలంలో కులవృత్తులు దెబ్బతిన్నాయని, వారికి ప్రత్యామ్నాయంగా కుటీర, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి స్పందించి బీసీ కార్పొరేషన్ ద్వారా తక్షణమే రుణాలు మంజూరు చేసి, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
