
- విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి
ముషీరాబాద్,వెలుగు: హాస్టళ్లలోని విద్యార్థులకు ప్రస్తుత నిత్యావసరాల ధరల ప్రకారం మెస్ చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య పటాన్ చెరువు బీసీ విద్యార్థి సేన అధ్యక్షుడిగా కె. వినయ్, సంగారెడ్డి జిల్లా సెక్రటరీగా వినయ్ కుమార్ ను నియమిస్తూ నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. బహిరంగ మార్కెట్ లో నిత్యవసర ధరలు పెరిగిపోగా హాస్టళ్లలో విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని, దీంతో వారు జ్ఞాపకశక్తితో పాటు శారీరకంగా ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలంటే సరైన ఆహారం, నిద్ర సరైన వాతావరణంతో కూడిన గదుల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల మెస్ చార్జీలపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని కాలేజీ విద్యార్థులకు 20వేల స్కాలర్షిప్, హాస్టల్ విద్యార్థులకు 3000, విదేశీ విద్యార్థుల సంఖ్యను300 నుంచి 1000 కి పెంచి స్టైపండు ఇవ్వాలని కోరారు. నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ స్టేట్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, అనంతయ్య, నందగోపాల్, రాజ్ కుమార్, పవన్ పాల్గొన్నారు.