
సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో.. పర్సంటేజీ విధానాన్ని అమలు చేసి మూతపడుతున్న థియేటర్స్‌ను కాపాడాలని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి కోరారు. చిత్ర పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి, గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు.
ఏపీలోనూ నంది అవార్డులను ప్రకటించాలని సీఎం చంద్రబాబును కోరారు. మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని ఈ విధానం లేకపోవడం వల్ల థియేటర్స్ మూతపడి నిర్మాతలు నాశనం అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై చాలా ఏళ్ల క్రితమే ఛాంబర్ ముందు టెంట్ వేసుకుని పెద్ద ఉద్యమం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
పర్సంటేజీని పక్కదారి పట్టించొద్దు..
పాతికేళ్లుగా నలుగుతున్న పర్సంటేజీ సమస్య ఓ కొలిక్కి వచ్చే సమయంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి లింకు పెట్టడం సరికాదని నారాయణమూర్తి అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కార్యాలయం వచ్చిన లేఖపై ఆయన స్పందిస్తూ.. ‘‘హరిహర వీరమల్లు’ సినిమా కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పవన్ కల్యాణ్‌పై ఎవరు కుట్ర చేస్తారు..? ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ఆ ప్రకటన సమంజసంగా లేదు.
తెలుగు చిత్రపరిశ్రమల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన ఎన్టీఆర్‌ను ఎంత గౌరవిస్తామో పవన్ కళ్యాణ్‌ను అంతలా గౌరవిస్తాం. అలాంటి వ్యక్తి ‘హరిహర వీరమల్లు’ కోసం కాకుండా చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు పిలిస్తే ఆయనపై గౌరవం మరింత పెరిగేది. సీఎం చంద్రబాబును ఇండస్ట్రీ పెద్దలు కలవాలని అనడంలో తప్పులేదు. కానీ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి పర్సంటేజి అంశాన్ని పక్కదారి పట్టించవద్దు.
పవన్ సినిమా విడుదల సమయంలో థియేటర్స్ బంద్ చేయడం వెనుక కుట్ర ఉందని మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడటం సరికాదు. ఈ పోరాటం ఇప్పటిది కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. అలాగే టికెట్ రేట్లు పెంచడం ద్వారా సగటు ప్రేక్షకుడికి సినిమాను దూరం చేయడమే అవుతుంది’ అని ఆయన అన్నారు.