
సమాజంలో జరిగే అన్యాయాలను తన సినిమాల ద్వారా నిర్భయంగా ప్రశ్నించే దర్శకుడు, నటుడు ఆర్. నారాయణమూర్తి. తన మార్క్ ను మరోసారి 'యూనివర్సిటీపేపర్ లీక్' చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు . ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. విద్యార్థులు, ఉద్యోగుల ఆకాంక్షలను వ్యాపారంగా మార్చుకుంటున్న నేటి విద్యా వ్యవస్థను ఈ సినిమా సూటిగా విమర్శించింది. ముఖ్యంగా, ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక ఉండే మాఫియా, దాని వల్ల మధ్యతరగతి విద్యార్థులు ఎలా నష్టపోతున్నారు అనే అంశాన్ని ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.
హృదయానికి హత్తుకునేలా..
సినిమా కథాంశం చాలా సరళంగా ఉంటుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాల్సిన విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను, పేపర్ లీకేజీల మాఫియాను ఈ సినిమాలో చూపించారు. ఈ మాఫియా వెనుక ఉన్న రాజకీయ నాయకులు, ధనవంతుల పిల్లల కోసం ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారో నారాయణమూర్తి తనదైన శైలిలో చూపించారు. సినిమాలో ఒకవైపు పేద విద్యార్థులు ఎలా కష్టపడుతున్నారో, మరోవైపు ధనవంతుల పిల్లలు అడ్డదారిలో ఎలా పరీక్షల్లో విజయం సాధిస్తున్నారో నారాయణమూర్తి ఎమోషనల్ సీన్లతో చూపించారు. ఒక పేద విద్యార్థి పడే ఆవేదన, ఒక రైతు పిల్లాడి కలలు వంటివి హృదయానికి హత్తుకుంటాయి. ఈ కథాంశం నారాయణమూర్తి గత చిత్రాల మాదిరిగానే చాలా బలమైనది.
కథాంశం
ఈ సినిమాలో ఆర్. నారాయణమూర్తి తండ్రి, కొడుకు పాత్రలలో నటించారు. కథ విషయానికొస్తే, రామయ్య ( ఆర్. నారాయణ మూర్తి ) ప్రభుత్వ ఉద్యోగి కాగా ఆయన కొడుకు అర్జున్ . తండ్రిలా ఆదర్శ భావాలతో పెరుగుతాడు. అర్జున్ ప్రభుత్వ పాఠశాలలో బాగా చదివి పోలీస్ ఉద్యోగం సాధిస్తాడు. రామయ్య తన మనవడు , మనవరాలిని ప్రభుత్వం పాఠశాలలోనే చేర్చాలని భావించగా.. కోడలు మాత్రం అందుకు అంగీకరించదు. కానీ పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతామని పట్టుబట్టి చేరతారు. పేదరికం, కష్టాలు ఉన్నా కసితో చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు కంటారు. అయితే మనవరాలు పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటుంది. దీనికి ప్రైవేటు యూనివర్సిటీ పేపర్ లీక్ చేయడం వల్లే తన మనవరాలి సూసైడ్ కు పరోక్ష కారణమని రామయ్య తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో రామయ్య ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? లీకేజీల వెనుక ఉన్న అసలు కుట్రలను ఎలా బయటపెట్టాడు? అనేది ఈ సినిమా కథాంశం.
పదునైన సంభాషణలతో..
ఎప్పటిలాగే నారాయణ మూర్తి ఉద్యమకారుడి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన సంభాషణలు చాలా పదునైనవి. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆయన సఫలీకృతం అయ్యారు. అంతే కాదు పేపర్ లీక్ అంశంతో పాటు ఇంగ్లీష్ మీడియం ఆవశ్యకతను, ఫీజు రీయింబర్స్ మెంట్ పేరుతో జరిగే దోపిడీలు, ఉద్యోగ నోటిఫికేన్ల వెనుక అక్రమాలను కూడా ఈ చిత్రంలో చూపించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు మనసును కలచివేస్తాయి. అయితే, ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన కొన్ని అంశాలు ఈ సినిమాలో తక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల డాక్యుమెంటరీ చూస్తున్న భావన కలుగుతుంది. సాంకేతిక అంశాల విషయానికొస్తే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం చాలా సాధారణంగా ఉన్నాయి. పాటలు, పోరాటాలు కథకు తగ్గట్లుగా ఉన్నా, ప్రేక్షకుడిని మెప్పించడంలో కొంత వెనుకబడ్డాయి.
మొత్తంగా, 'యూనివర్సిటీ పేపర్ లీక్' ఒక సందేశాత్మక చిత్రం. ఇది కేవలం వినోదం కోసం తీసిన సినిమా కాదు, ఆలోచింపజేసే సినిమా. సమాజంలోని లోపాలను ప్రశ్నించే ఇటువంటి చిత్రాలు రావాల్సిన అవసరం చాలా ఉంది. ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యారంగంలోని అవినీతిపై నారాయణమూర్తి వేసిన ప్రతి అడుగు ప్రశంసనీయం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడం కంటే, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పడం సముచితం.