ఆర్​ఆర్​ఆర్​ భూ సేకరణపై రైతుల్లో ఆందోళన

ఆర్​ఆర్​ఆర్​ భూ సేకరణపై రైతుల్లో ఆందోళన
  • బయట ఎకరాకు కోటికిపైనే 
  • పరిహారంపై సర్కారు నుంచి నో క్లారిటీ
  • ఫస్ట్ ఫేజ్ కింద 4 జిల్లాల్లో 4,620 ఎకరాల భూసేకరణ
  • నోటిఫికేషన్​ రాకముందే మార్కింగ్​, బౌండరీలు
  • పెద్దల భూములను తప్పించేలా అలైన్​మెంట్ మార్చినట్లు ఆరోపణలు

రైతు పేరు నిమ్మ మోహన్‌‌రెడ్డి. ఈయనది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు. ఊరిలో తనకున్న ఆరు ఎకరాల్లో ఎవుసం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల కింద ఎకరాకు రూ. 1.30 కోట్లు ఇస్తామని కొందరు ఆఫర్​ చేసినా అమ్మేందుకు నిరాకరించాడు. తీరా వారం కింద రీజనల్​ రింగ్​రోడ్డు (ఆర్​ఆర్​ఆర్​) కోసం మోహన్ రెడ్డి భూమిలో ఆఫీసర్లు మార్కింగ్‌‌ చేశారు. దాని ‌ప్రకారం మోహన్ రెడ్డి స్థలం  సుమారు మూడెకరాలు ఆర్​ఆర్​ఆర్​లో పోయేలా ఉంది. కోట్ల విలువైన భూమిని ఆర్ ఆర్ ఆర్ కోసం సర్కారు తీసుకొని తక్కువ పరిహారం చేతిలో పెడ్తే తన కుటుంబం ఏమవుతుందోనన్న ఆవేదనతో మోహన్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యాడు.

సిద్దిపేట / మెదక్, వెలుగు: హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల మీదుగా నిర్మించనున్న రీజనల్​ రింగు రోడ్డు (ఆర్​ఆర్​ఆర్)లో తమ భూమి ఎక్కడ పోతుందోనన్న టెన్షన్ రైతుల్లో నెలకొంది. మార్కెట్​ రేటు ఒక తీరుగా ఉంటే..  సర్కారేమో అందులో 15 శాతం కూడా ధర కట్టిచ్చేలా లేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇరిగేషన్​ ప్రాజెక్టుల కోసం, కెనాల్స్​ కోసం, హైటెన్షన్​ టవర్ల కోసం తమ విలువైన భూములను కోల్పోయామని, వాటికి సరైన పరిహారం కూడా రాలేదని అంటున్నారు. ఆర్​ఆర్​ఆర్​ ఫస్ట్​ ఫేజ్​ కింద సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని గ్రామాల్లో భూముల సేకరణకు అధికారులు సిద్ధమయ్యారు. రైతుల భూముల్లో రాళ్లు పాతుతున్నారు. భూ యజమానులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేట్​ఏజెన్సీ వాళ్లతో మార్కింగ్​ చేయించి, బౌండరీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు కలవరపడుతున్నారు. మొదట అనుకున్న అలైన్​మెంట్​ కాకుండా పెద్దల భూములను  కాపాడేందుకు తమలాంటి పేద రైతులను బలిచేసేలా అలైన్​మెంట్​ మార్చారని వారు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం ఎంత అనేది తేల్చిన తర్వాతే భూముల సేకరణకు రావాలని, ఇప్పటికే తమ బతుకులు ఆగమయ్యాయని, తక్కువ పరిహారం ఇచ్చి తమ పొట్టకొట్టొద్దని  రైతులు అంటున్నారు. 

ప్రస్తుతం ఉన్న ఔటర్​ రింగ్​ రోడ్​ (ఓఆర్ఆర్) బయట సుమారు రూ. 13 వేల  కోట్లతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్​ మాల పరియోజన స్కీం’ కింద రీజినల్​ రింగ్​ రోడ్డు(ఆర్​ఆర్​ఆర్​)ను  నిర్మిస్తున్నది. ప్రాథమిక అంచనా ప్రకారం 338 కిలో మీటర్ల  పొడవుతో మొదట నాలుగు లేన్లుగా చేపట్టి, భవిష్యత్​లో 6 నుంచి 8 లేన్లకు విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు.  ఫస్ట్ ఫేజ్ కింద  సంగారెడ్డి, మెదక్‌‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 20 మండలాలు, 111 గ్రామాల్లో ఆర్ ఆర్ ఆర్ అలైన్​మెంట్​ఖరారైంది. దీంతో కోట్ల రూపాయల విలువజేసే తమ భూములను ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నిజానికి సీఎస్ పర్యవేక్షణలో పనిచేసేలా రెవెన్యూ ఆఫీసర్లతో ప్రతి జిల్లాకో స్పెషల్​టీమ్​ వేసి భూసేకరణ చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ముందుగా భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్​ ఇచ్చాక, పరిహారం నిర్ణయించాలి. తర్వాత భూ యజమానులకు నోటీసులు జారీ చేశాకే ​మార్కింగ్​ చేసి, బౌండరీలు పాతాలి.  కానీ అవేవీ లేకుండా కొన్ని గ్రామాల్లో రైతుల పొలాల్లో హద్దురాళ్లు పాతుతున్నారు. 

ఫస్ట్​​ఫేజ్​కు 4,620 ఎకరాలు
ఆర్​ఆర్​ఆర్​ను నార్త్​ ఫేజ్​, సౌత్​ ఫేజ్​ కింద రెండు భాగాలుగా నిర్మించేందుకు కేంద్ర రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ  ఇప్పటికే నిర్ణయించింది. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఫస్ట్​ ఫేజ్​(నార్త్​ఫేజ్​)ను రూ. 7,512 కోట్ల ఖర్చుతో 158 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఇందుకోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 4,620 ఎకరాల భూమి అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన రోడ్డు అలైన్​మెంట్​ను ఇప్పటికే ఓకే చేశారు. దీని ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని  కొండాపూర్​, సదాశివపేట, సంగారెడ్డి, చౌటకూర్​, హత్నూర, మెదక్​ జిల్లాలోని నర్సాపూర్​, కౌడిపల్లి, శివ్వంపేట, తూప్రాన్​, మాసాయిపేట, సిద్దిపేట జిల్లాలోని రాయిపోల్​, గజ్వేల్​, వర్గల్​, మర్కూక్​, జగదేవ్​పూర్​, యాదాద్రి– భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల పరిధిలోని 111 గ్రామాల మీదుగా ఆర్​ఆర్​ఆర్​  పోతోంది. ఈక్రమంలో  సంగారెడ్డి జిల్లా శివ్వంపేట వద్ద, నర్సాపూర్​ మండలం పెద్ద చింతకుంట, రెడ్డిపల్లి మధ్య, మెదక్​ జిల్లా మాసాయిపేట వద్ద,  సిద్దిపేట జిల్లా గౌరారం సమీపంలో,  భువనగిరి జిల్లా రాయగిరి వద్ద ఐదు భారీ సర్కిల్స్​ నిర్మించనున్నారు.  ఇప్పటికే ఫస్ట్​ఫేజ్​అలైన్​మెంట్​ఓకే కావడంతో ప్రైవేట్​ఏజెన్సీ ఆధ్వర్యంలో ఊర్లలో బౌండరీలు వేస్తున్నారు. 

బయట ఎకరా కోటికి పైనే.. సర్కారు ఇచ్చేది ఎంతో!
ఆర్ ఆర్ ఆర్ కోసం ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో సేకరిస్తున్న భూముల విలువ బహిరంగ మార్కెట్​లో ఎకరా రూ. కోటికి పైగా పలుకుతోంది. ఈలెక్కన ఫస్ట్​ఫేజ్​పరిహారానికి రూ. 4,620 కోట్లు కావాలి. ఇది ఫస్ట్​ఫేజ్​ ప్రాజెక్టు వ్యయంలో 61 శాతం. ఇంత ఇవ్వడం  ముమ్మాటికీ సాధ్యమయ్యే పనికాదని ఆఫీసర్లు అంటున్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మూడు ఇరిగేషన్​ప్రాజెక్టుల కింద భూములు సేకరించేటప్పుడు నిర్వాసితులకు ప్రపంచం అబ్బురపడే పరిహారం ఇస్తామని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. తీరా భూములు సేకరించాక ఎకరాకు కనిష్టంగా రూ. 6 లక్షలు, గరిష్టంగా రూ. 8 లక్షలు మాత్రమే చెల్లించింది. కొండపోచమ్మ సాగర్ కింద సేకరించిన కొన్ని భూములు హైదరాబాద్‌‌కు సమీపంలో ఉన్నాయనే కారణంతో చాలా కొద్దిమందికి మాత్రం ఎకరాకు రూ. 15 లక్షల చొప్పున చెల్లించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల్లో కొందరు తమకు తక్కువ పరిహారం వచ్చిందని కోర్టును ఆశ్రయించగా, వాళ్లకు కూడా ఎకరాకు రూ. 15 లక్షల చొప్పున ఇచ్చారు. ఈలెక్కన ఆర్​ఆర్​ఆర్​ కింద సేకరించే భూములకు కూడా గరిష్టంగా రూ. 15 లక్షలు మాత్రమే చెల్లిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

రంగంలోకి రియల్టర్లు..
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్​మెంట్ గురించి టీఆర్​ఎస్​ లీడర్లకు, వాళ్ల ద్వారా రియల్టర్లకు  ముందే లీకయిందనే అనుమానాలు ఉన్నాయి. దీంతో రెండు, మూడు నెలలుగా సంగారెడ్డి, మెదక్‌‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో రియల్టర్లు భూములు సేకరించే పనిలో పడ్డారు. ‘‘ఆర్​ఆర్​ఆర్ ​మీ భూమిలోంచే పోయే చాన్స్​ ఉంది. ఇదే జరిగితే ప్రభుత్వం ఎకరాకు రూ. 15 లక్షలకు మించి ఇయ్యదు” అని భయపెడ్తూ ఎకరాకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పెట్టి కొంటున్నారు. ఇంకొందరు రియల్టర్లు ఓ అడుగు ముందుకేసి తమతో పార్ట్​నర్​షిప్​అగ్రిమెంట్​చేసుకుంటే అలైన్​మెంట్​​మార్పిస్తామని చెప్తున్నారు. రోడ్డు వచ్చాక పక్కనే భూములు డెవలప్​చేసి, అమ్మేసేలా అగ్రిమెంట్స్​ చేసుకుంటున్నారు. భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసి, పరిహారం ఎంతో నిర్ణయించాకే రెవెన్యూ ఆఫీసర్లు మార్కింగ్​ చేయాలని, అప్పటిదాకా బౌండరీలు పాతడం ఆపాలని డిమాండ్​ చేస్తున్నారు. 

పెద్దల భూములకు నష్టం కలుగకుండా..!
ఆర్ ఆర్ ఆర్ అలైన్​మెంట్ పేరిట లోకల్​ సోషల్​ మీడియా గ్రూపుల్లో రోజుకో గూగూల్​ మ్యాప్​చక్కర్లు కొడుతున్నది. మొదటి మ్యాపులకు తాజా మ్యాపులకు తేడా కనిపిస్తున్నది. పలుకుబడి కలిగిన పెద్దలు, టీఆర్​ఎస్​ లీడర్లు తమ భూములు పోకుండా పైస్థాయిలో మేనేజ్​ చేస్తున్నారని, అందుకే అలైన్​మెంట్లు మారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ కోసం స్థానిక రెవెన్యూ ఆఫీసర్లను సంప్రదిస్తే తమకేమీ తెలియదంటూ దాటవేస్తున్నారని రైతులు అంటున్నారు. మొదట్లో గజ్వేల్ అవతలి నుంచి ఆర్​ఆర్​ఆర్​ పోతుందని అనుకున్నా.. తాజా అలైన్​మెంట్​లో ఎర్రవల్లి లోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్​కు మూడు కిలో మీటర్ల దూరం నుంచే వెళ్తున్నది. ఎర్రవల్లి ఫామ్​హౌస్​ కోసమే రూట్​ మార్చారనే అనుమానాలు వస్తున్నాయి. ఎర్రవల్లికి  సమీపంలోనే  రూలింగ్‌‌ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న ఓ సీడ్​కంపెనీ భూములను కూడా ఆర్ ఆర్ ఆర్ నుంచి తప్పించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలో ఓ  ఫార్మా కంపెనీ మేనేజ్ మెంట్ కు ఫాంహౌస్ ఉంది. వారికి అక్కడ పెద్ద మొత్తంలో భూములున్నాయి. రూలింగ్​పార్టీ లీడర్లకూ అందులో పార్ట్​నర్ షిప్ ఉందనేది టాక్​. దీంతో ఇక్కడ కూడా ఆర్ ఆర్ ఆర్ అలైన్​మెంట్​మారిందనే ప్రచారం జరుగుతున్నది. యాదాద్రిలోనూ మొదట అనుకున్న అలైన్​మెంట్ మారడం వెనుక ఇలాంటి కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ​ గూగుల్ మ్యాప్స్​, జీపీఎస్​, డ్రోన్ కెమెరాల సాయంతో ఇప్పటికే సర్వే నిర్వహించి పెద్దల భూములు  పోకుండా ఆఫీసర్లు అలైన్​మెంట్​ఖరారు చేశారని, అందుకే సామాన్య రైతులు భూములు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ ఫొటోలోని రైతు పేరు కనకరాజు. ఈయనది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తంబళ్లపల్లి. ఆర్ ఆర్ ఆర్ నిర్మాణంతో ఈయన సొంత భూమి ఎకరంన్నర తోపాటు తన కుటుంబానికి చెందిన మరో పది ఎకరాల్లో ఆఫీసర్లు మార్కింగ్​ చేశారు. గజ్వేల్ -తూఫ్రాన్ రోడ్డు దగ్గర్లోని  వీరి జాగలోనే పెద్ద జంక్షన్ ఏర్పాటుకానుంది. దీంతో భూమి దాదాపుగా పోతుందని ఆఫీసర్లు చెప్పడంతో కనకరాజు కుటుంబానికి నిద్ర కరువైంది. ఇక్కడ ఎకరం తక్కువలో తక్కువ కోటిన్నర రూపాయలు పలుకుతున్నది. సర్కారు అరకొర పరిహారం ఇస్తే  తమ కుటుంబం రోడ్డుపాలవుతుందని, ఏం చేయాలో పాలు పోవడం లేదని  కనకరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

లీడర్ల భూములు పోకుండా మలిపిన్రు
యాదగిరిగుట్ట పక్కన దాతరపల్లిలో నా భూమిలకెల్లే కొత్త రింగ్ రోడ్ పోతున్నది. పక్క వెంచరోళ్లు కోట్లు ఇస్తమన్నా అమ్మలే. ఇప్పుడేమో రోడ్ ఏస్తమని మార్కింగ్ పెట్టిన్రు. అరెకరం పోతున్నది.  భువనగిరి పక్కకు రామక్రిష్ణా పురంల గూడ మాదాంట్లనే దిమ్మె నాటిన్రు. అక్కడ ఐదెకరాలు పోయేటట్టుంది. ఇగ మా బతుకేంది? మొదాలు యాదగిరిగుట్ట ఔతలికెల్లి రింగ్ రోడ్ పడ్తదన్నరు. ఆ ఏరియాల టీఆర్ఎస్ పెద్ద లీడర్లకు వందల ఎకరాల వెంచర్లు, భూములున్నయట. అందుకే ఇటు మల్పి రోడ్లేస్తరట. ఐదెకరాలకు సర్కార్ ఇచ్చే పైసలతోటి మా ఏరియాల ఇల్లు జాగ గూడ రాదు.
- చిన్నం విజయరాజు, యాదాద్రి జిల్లా

మార్కెట్ రేట్ ఇయ్యాలె
ఆర్ ఆర్ ఆర్ నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుంచి విలువైన  భూములు సేకరిస్తున్నందున బయటి మార్కెట్ రేట్ కట్టియ్యాలి.  కాసాల  శివారులో నాకు నాలుగెకరాల పొలం ఉండగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్ కోసం మా పొలంల హద్దులు పెట్టిన్రు. దీంతో నా విలువైన భూమిని ప్రభుత్వం తీసుకుంటుందేమోనని  టెన్షన్ పట్టుకుంది.  ఎంత భూమి  పోతుందోనని ఎవరిని అడిగినా  తెలుస్త లేదు. కానీ  ఆర్ ఆర్ ఆర్  కోసం మా పొలం చాలా వరకు పోయేటట్టుంది. లేదంటే ఎంత పొలం తీసుకుంటారో మరో చోట అంత పొలం ఇవ్వాలి.
- కొల్కురి జైపాల్ రెడ్డి, రైతు, కాసాల, సంగారెడ్డి జిల్లా