బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

జడ్చర్ల టౌన్, వెలుగు: న్యాయమైన వాటా కోసం బీసీ నాయకులంతా ఏకమై పోరాడాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ్​నగర్​జిల్లా జడ్చర్లలో నిర్వహించిన జడ్చర్ల, వనపర్తి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లలో కోత విధించారంటున్న బీజేపీలోని బీసీ లీడర్లు... కుల గణన చేయాలని, బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

రిజర్వేషన్లు, బీసీ కుల గణన ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు15 మందితో స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలపై పోరాడాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కోఆర్డినేటర్ బాలస్వామి, నాయకులు రాములమ్మ, తోకల కృష్ణ, చెన్నరాములు, బాలవర్దన్ గౌడ్, సాగర్ సత్యం పాల్గొన్నారు