రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు.. 35 లక్షల ఎకరాల్లో వరినాట్లు.. 8 లక్షల ఎకరాల్లో మక్కలు: వ్యవసాయ శాఖ

 రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు.. 35 లక్షల ఎకరాల్లో వరినాట్లు.. 8 లక్షల ఎకరాల్లో మక్కలు: వ్యవసాయ శాఖ
  •     మిల్లెట్ సాగులో జొన్నలే అత్యధికం.. తర్వాత 1.71 లక్షల ఎకరాల్లో వేరుశనగ 
  •     పప్పుశనగ 1.69 లక్షల ఎకరాల్లో సాగు
  •     వ్యవసాయ శాఖ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగు 45 లక్షల ఎకరాలు దాటింది. సంక్రాంతి తర్వాత నుంచి మొత్తం యాసంగి సాగులో వరి అత్యధికంగా సాగైంది. నీటి వనరులున్న చోట ఇప్పటికే పొలాలు దున్ని నాట్లు వేశారు. కోతలు ఆలస్యమైన చోట నాట్లు కొనసాగుతున్నాయి. ఈయేడు వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువుల్లో, కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో బావుల్లో నీళ్లు సరిపడా ఉన్నాయి. వ్యవసాయ బోరు బావులన్నీ ఫుల్ రీఛార్జ్ అయి కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈయేడు యాసంగిలోనూ వరి సాగుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి. 

బోరు బావుల కింద వరి సాగుకు రైతులు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈసారి యాసంగిలో అత్యధికంగా సాగు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వరి సాగు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. యాసంగి వరి సాగు సాధారణ విస్తీర్ణం 47.27 లక్షల ఎకరాలు కాగా, ఈయేడు 70 లక్షల ఎకరాల మార్క్‌‌ను దాటే అవకాశం ఉందని అంటున్నారు. వానాకాలంలో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 

ఇప్పటికే 35 లక్షల ఎకరాల్లో వరి సాగు.. 

యాసంగిలో వరి సాధారణ సాగు 47.27 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 35 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సూర్యాపేట 4 లక్షల ఎకరాల సాగుతో టాప్‌‌లో నిలిచింది. తర్వాత 3.56 లక్షల ఎకరాలతో నల్గొండ రెండో స్థానంలో,  నిజామాబాద్ జిల్లా 3.36 లక్షల ఎకరాలతో మూడో స్థానంలో నిలిచింది. యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

యాసంగిలో మక్కలే ఎక్కువ..

యాసంగి సాగులో వరి తర్వాత అత్యధికంగా మొక్కజొన్న సాగు జరిగింది. మొక్కజొన్న సాధారణ సాగు 5.89 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 8 లక్షల ఎకరాల్లో పంట వేశారు. 1.50 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేసి ఖమ్మం జిల్లా టాప్‌‌లో నిలిచింది. ఇక మిగతా అన్ని రకాల పంటలు ఇప్పటివరకు 7 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో ప్రధానంగా పప్పుశనగ 1.69 లక్షల ఎకరాలకు పైగా సాగు జరిగింది. ఈ సీజన్‌‌లో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 1.71 లక్షల ఎకరాలకు పైగా సాగైంది. ప్రధానంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 95 వేల ఎకరాలకు పైగా పల్లీ సాగు జరిగింది. 

మిల్లెట్‌‌లో జొన్నలే ఎక్కువ..

యాసంగిలో మిల్లెట్స్ సాగులో జొన్న పంటలే కొంత మేర సాగవుతున్నాయి. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 1,39,565 ఎకరాలు కాగా ఇప్పటివరకు 1.84 లక్షల ఎకరాల్లో పంట వేశారు. సజ్జ పంట సాధారణ సాగు విస్తీర్ణం 14,689 ఎకరాలు కాగా, ఇప్పటివరకు పెద్దగా నమోదు కాలేదు. కొర్రల సాధారణ సాగు 370 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 50 ఎకరాల్లోపే సాగైంది. రాగులు సాధారణ సాగు 1,058 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు పెద్దగా సాగు నమోదు కాలేదు.