రాచకొండలో పెరిగిన క్రైమ్ రేట్ .. 25 శాతం పెరిగిన సైబర్ మోసాలు

రాచకొండలో పెరిగిన క్రైమ్ రేట్ ..  25 శాతం పెరిగిన సైబర్ మోసాలు
  • గతేడాదితో పోలిస్తే 6.86 శాతం ఎక్కువగా నేరాలు
  •   పలు కేసుల్లో  20 మందికి జీవిత ఖైదు, 50 మందిపై పీడీ యాక్ట్
  • 282 డ్రగ్స్ కేసుల్లో 698 మంది అరెస్ట్
  • యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసిన సీపీ సుధీర్ బాబు

హైదరాబాద్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది  నేరాల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే 6.86 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. గతేడాది 25,815 కేసులు నమోదు కాగా,ఈ ఏడాది 27,586 నమోదయ్యాయి. ఎప్పటిలాగే సైబర్ నేరాల సంఖ్య సైతం పెరిగింది. గతేడాది 2,049 సైబర్ నేరాలు నమోదుగా.. ఈసారి 2,562 కేసులు నమోదయ్యాయి. 

సిటీ శివారు ప్రాంతాల్లో 24.53 శాతం హత్యలు, ఇండ్లలో చోరీల సంఖ్య 9.73 శాతం పెరిగింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలతో యాన్యువల్ రిపోర్టును సీపీ సుధీర్ బాబు బుధవారం రిలీజ్ చేశారు. నాగోల్​లోని ఓ ఫంక్షన్ హాల్​​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీలతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.  నేరాల నియంత్రణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించామని చెప్పారు. ఈ ఏడాది 5,241 కేసుల్లో దోషులకు శిక్ష పడేలా దర్యాప్తు చేశామన్నారు. 

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో దేశంలోనే మూడో స్థానం

తీవ్రమైన నేరాల్లో 20 మందికి కోర్టులు జీవిత ఖైదు విధించాయని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. లోక్‌‌‌‌‌‌‌‌ అదాలత్‌‌‌‌‌‌‌‌లలో కేసులు పరిష్కరించడంలో రాచకొండ కమిషనరేట్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది 8,982 కేసులను లోక్ అదాలత్‌‌‌‌‌‌‌‌లో డిస్పోజ్ చేశామని పేర్కొన్నారు. కేసుల దర్యాప్తులో పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించడంతో కన్విక్షన్ రేట్‌‌‌‌‌‌‌‌ 61 శాతానికి పెరిగిందన్నారు. 

 చైన్‌‌‌‌‌‌‌‌ స్నాచింగ్స్‌‌‌‌‌‌‌‌, దోపిడీలు 18. 5  శాతం తగ్గాయన్నారు. ఈ క్రమంలోనే మహిళపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక దాడులు తగ్గాయన్నారు. వరకట్న వేధింపుల కారణంగా ఆరుగురు మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారని సీపీ తెలిపారు. 299 వ్యభిచార గహాలను సీజ్ చేశామని చెప్పారు. ఈ ఏడాదిలో 177 బాల్య వివాహాలను షీ టీమ్స్ పోలీసులు అడ్డుకున్నారని వివరించారు. 

డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం

గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. విజయవాడ – హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హైవేతో పాటు వరంగల్ హైవే, ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిఘా కొనసాగుతున్నదని తెలిపారు. మహారాష్ట్ర, బీదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్ద ఎత్తున్న గంజాయి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ జరుగుతున్నదని చెప్పారు. ఈ ఏడాది 282 కేసుల్లో 698మందిని అరెస్ట్ చేశామన్నారు. 5,883 కిలోల గంజాయి, 6 లీటర్ల హాష్ ఆయిల్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

ఈ క్రమంలోనే 4.505 కిలోల నల్లమందు,377 గ్రాముల హెరాయిన్‌‌‌‌‌‌‌‌, 9.2 కిలోల గసగసాలు,27 ఎక్స్‌‌‌‌‌‌‌‌టసీ పిల్స్‌‌‌‌‌‌‌‌,1,50 గ్రాముల చరాస్ పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ఇతర డ్రగ్స్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.12 మంది గంజాయి సప్లయర్లు, రిపీటెడ్‌‌‌‌‌‌‌‌గా నేరాలు చేసే 50 మందిపై పీడీ యాక్ట్‌‌‌‌‌‌‌‌ ప్రయోగించినట్లు సీపీ తెలిపారు. సిఫార్సు లెటర్స్‌‌‌‌‌‌‌‌ పోస్టింగ్స్ పొందిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.