నకిలీ విత్తనాలను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్

నకిలీ విత్తనాలను  అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్

ఎల్ బీనగర్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల సరఫరా, అమ్మకాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ డీఎస్ చౌహాన్ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎల్బీ నగర్ లోని సీపీ క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అమ్ముతూ రైతులను మోసం చేసే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామని, వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన, ఎరువుల షాపులపై దాడులు చేపట్టాలని ఆదేశించారు.

రైతులు  నకిలీ విత్తనాల విషయంలో అలర్ట్గా ఉండాలని, విత్తనాల ప్యాకెట్ల మీద లోగో, హోలోగ్రాం వంటి వాటిని బాగా పరిశీలించి మాత్రమే కొనాలని సూచించారు. నకిలీలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి, మల్కాజిగిరి- మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.