టాస్ దగ్గర నుంచి మొదలు.. బాల్ టు బాల్ బెట్టింగ్

టాస్ దగ్గర నుంచి మొదలు.. బాల్ టు బాల్ బెట్టింగ్
  • సోషల్ మీడియాలో యాప్ లు క్రియేట్ చేసి మరీ బెట్టింగులు నిర్వహణ
  • నిర్వాహకుడి కుటుంబ సభ్యుల పేరు మీద 9 బ్యాంకు అకౌంట్లు గుర్తించిన పోలీసులు
  • 16 లక్షల నగదు, 4 మొబైల్ ఫోన్లు, 28క్రెడిట్ కార్డులు సీజ్ చేసిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్: ఈజీ మనీ కోసం ఆన్ లైన్ బెట్టింగ్ బిజినెస్ మొదలుపెట్టాడు. డబ్బులు బాగా వస్తుండడంతో సోషల్ మీడియాలో యాప్ లు క్రియేట్ చేసి మరీ తనలాంటి వారిని ఆకర్షించేడు. ఈజీ మనీకి అలవాటు పడి  ఫ్రాడ్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన రాచకొండ ఎల్బీనగర్ ఎస్.ఓ.టి పోలీసులు నిందితుడి గురించి సమాచారం అందడంతో వలపన్ని గురువారం అరెస్టు చేశారు. నిందితుడు 9 మంది కుటుంబ సభ్యుల పేర్ల మీద బ్యాంకు అకౌంట్లు ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద సుమారు 16 లక్సల నగదు, 4 మొబైల్ ఫోన్లు, 28 క్రెడిట్ కార్డులను సీజ్ చేశారు.  
ఎల్బీనగర్ రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీస్ లో నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ నాగర్ కర్నూలుకు చెందిన క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు హైదరాబాద్ కు వచ్చి బెట్టింగ్ వ్యవహారం ప్రారంభించాడని తెలిపారు. నిందితుడు షేక్ సాదిక్ నుండి సుమారు 95 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీ సీజ్ చేశావన్నారు. 15 లక్షల 70 వేల నగదు, 4 మొబైల్ ఫోన్లు,  28 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని, ఆర్గనైజర్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్ అకౌంట్ ల గుర్తించామని, అకౌంట్లో ఉన్న 69 లక్షల అరవై మూడు వేలు నగదు సీజ్ చేశామన్నారు. 
సోషల్ మీడియాలో యాప్ లు క్రియేట్ చేసి బెట్టింగ్ 
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ తన బెట్టింగ్ వ్యాపారంలో మోసాలు లేవంటూ యాప్ లు క్రియేట్ చేశాడు. UB UAE BET, 8 TEAM, MB MAX, INPLAY BET లాంటి యాప్ ల ద్వారా  బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ యాప్ లకు సబ్ స్క్రైబ్ చేసుకున్న బుకీల నుండి ఐడీ, పాస్ వార్డ్ తీసుకుంటున్నాడని.. ఆ తరువాత సోషల్ మీడియా లో ఇంట్రెస్ట్ ఉన్న ఫంటర్స్ తో బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. మ్యాచ్ జరిగేటప్పుడు లింకులను ఫంటర్స్ కు పంపించి బెట్టింగులకు పాల్పడుతున్నాడని, ఫంటర్స్ నుండి డబ్బులు వసూలు చేసి ఆన్ లైన్ లో బూకీలతో నేరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. 
టాస్ దగ్గర నుంచి మొదలు.. బాల్ టు బాల్ బెట్టింగ్
టాస్ వేయడం మొదలు పెడితే మ్యాచ్ ముగిసే వరకు బాల్ టూ బాల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫంటర్స్ బెట్టింగ్ లో గెలిస్తే వారి నుండి ముప్పై శాతం కమిషన్ కూడా తీసుకుంటాడు. ఇండియా ,ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్,ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ల మధ్య నిన్న జరిగిన టీ 20 మ్యాచ్ లు బెట్టింగ్లకు పాల్పడినట్లు గుర్తించామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మధ్యలో డ్రాప్ అయ్యే ఫెసిలిటీ కూడా కల్పిస్తారని, తెలిసీ తెలియక ఇలాంటి క్రికెట్ బెట్టింగ్ వలన చాలామంది మోసపోతున్నారని, ఈజీ మనీ కి అలవాటు పడి ఇలాంటి ఫ్రాడ్ గేమ్స్ నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆర్ధిక వ్యవహారాలను నిరంతరం గమనిస్తుండాలని.. అలాగే అనవసరంగా  డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.